Share News

మళ్లీ హెచ్‌-1బీకి లక్ష డాలర్ల ఫీజు!

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:46 AM

అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల (రూ.90 లక్షలకు పైగా) అదనపు రుసుము తిరిగి అమల్లోకి వచ్చింది. దీంతో కంపెనీల యాజమాన్యాలు, విదేశీ నిపుణులు...

మళ్లీ హెచ్‌-1బీకి లక్ష డాలర్ల ఫీజు!

న్యూఢిల్లీ, జూన్‌ 15: అమెరికాలో హెచ్‌-1బీ వీసాలపై ట్రంప్‌ ప్రభుత్వం విధించిన లక్ష డాలర్ల (రూ.90 లక్షలకు పైగా) అదనపు రుసుము తిరిగి అమల్లోకి వచ్చింది. దీంతో కంపెనీల యాజమాన్యాలు, విదేశీ నిపుణులు తీవ్ర అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వివాదాస్పద లక్ష డాలర్ల ఫీజును ఫెడరల్‌ కోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే, మసాచుసెట్స్‌ జిల్లా కోర్టు ప్రభుత్వ అప్పీల్‌ పెండింగ్‌లో ఉన్నందున.. ఆ చార్జీని తాత్కాలికంగా పునరుద్ధరించింది. లక్ష డాలర్ల ఫీజు వసూలు చేసేందుకు అధికారులకు అవకాశం కల్పించింది. ఈ నెల 12న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కాన్సులర్‌ నోటిఫికేషన్‌ చానళ్ల ద్వారా దాఖలు చేసే కొన్ని హెచ్‌-1బీ పిటిషన్లపై అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎ్‌ససీఐఎస్‌) ఈ ఫీజును తాత్కాలికంగా వసూలు చేసుకోవచ్చు. ఇది నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులపై ఆధారపడే కంపెనీలకు ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. వాస్తవానికి, అమెరికా ఉద్యోగుల ప్రయోజనాల పేరుతో హెచ్‌-1బీ లాటరీకి ఎంపికైన అభ్యర్థులు విధిగా లక్ష డాలర్ల ప్రత్యేక రుసుము చెల్లించాలని గత సెప్టెంబరులో ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మసాచుసెట్స్‌లోని ఫెడరల్‌ జిల్లా కోర్టు ఈనెల 8న కీలక తీర్పు వెలువరించింది. ఈ అదనపు రుసుము చట్టవిరుద్ధమైందిగా తేల్చిచెప్పింది. ‘లక్ష డాలర్ల రుసుము కేవలం ఫీజు కాదు, ఇది పన్ను కిందకు వస్తుంది. సరైన చట్టపరమైన అధికారం లేకుండా విధించారు’ అని పేర్కొంది. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం అప్పీల్‌ నోటీస్‌ దాఖలు చేయగా.. కోర్టు తన గత తీర్పుపై స్టే విధిస్తూ ఈనెల 12న నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీలు విదేశీనిపుణుల నియామకాన్ని ఆలస్యం చేయవచ్చని నిపుణులు అంటున్నారు.

ఇవీ చదవండి:

పైలట్‌ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!

టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!

Updated Date - Jun 16 , 2026 | 05:46 AM