సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి: బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:47 PM
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు పద్మభూషణ్ పురస్కారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను హింసకు తావులేకుండా నిర్వహించారని, ఈ మేరకు దేశ మూడో అత్యున్నత పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించారు.
కోల్‌కతా: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar)కు పద్మభూషణ్ పురస్కారం ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సామిక్ భట్టాచార్య డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను హింసకు తావులేకుండా నిర్వహించడంలో జ్ఞానేశ్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఓటర్ల జాబితా నుంచి బంగ్లాదేశీయుల పేర్లను తొలగించడంలోనూ చొరవ చూపారని భట్టాచార్య ప్రశంసించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా ఓటు వేసే పరిస్థితి ఏర్పడిందని సామిక్ భట్టాచార్య అన్నారు. ఎన్నికల సమయంలో హత్యలు వంటి ఘటనలు చోటుచేసుకోలేదని, ఇందుకు జ్ఞానేశ్ కుమార్ కృషి కారణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి ఎన్నికలను చాలా అరుదుగా చూశారని, అందుకే సీఈసీకి బెంగాల్ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ఆయనకు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఎన్నికల సంఘం పనితీరుపై ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న వేళ భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సామిక్ భట్టాచార్య ఖండించారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన ఆరోపణలనూ కొట్టిపారేశారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న ఓటు హక్కును దెబ్బతీస్తున్నారనే రాహుల్ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
డజను మంది ఎమ్మెల్యేలకు రెండు పెళ్లిళ్లు.. సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలపై దుమారం..
గజియాబాద్‌లో విషాదం.. 12వ అంతస్తు నుంచి పడి జాతీయస్థాయి ఛాంపియన్ మృతి..