మహిళా బైకర్ సియా హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడిపై హత్యాయత్నం సెక్షన్ జోడించిన పోలీసులు
ABN , Publish Date - Sep 15 , 2026 | 12:13 PM
మహిళా బైకర్ సియాను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో గురుగ్రామ్ పోలీసులు హత్యాయత్నం సెక్షన్‌ను చేర్చారు. పోలీసుల తీరుపై బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తడంతో అదనపు సెక్షన్ జోడించారు.
గురుగ్రామ్: మహిళా బైకర్ సియాను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గురుగ్రామ్ పోలీసులు ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో హత్యాయత్నం సెక్షన్‌ను చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. పోలీసుల తీరుపై బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు ప్రశ్నలు లేవనెత్తడంతో అదనపు సెక్షన్ జోడించారు. దీనిపై సీనియర్ పోలీసు అధికారి సందీప్ మాలిక్ స్పందిస్తూ.. బైకర్ సియాను కల్యాణ్ ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ మేరకు హత్యాయత్నం సెక్షన్‌ను చేర్చినట్లు వెల్లడించారు.
కాగా, సియా, ఆమె స్నేహితులు స్పోర్ట్స్ బైక్‌లపై గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై వెళ్తున్నారు. సియాను కల్యాణ్ అనే వ్యక్తి కారుతో వెంబడించాడు. ఆమెను బైక్ ఆపాలని అతను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె మాత్రం తనను ఎందుకు ఫాలో అవుతున్నావని, కారును తనకు దూరంగా పోనివ్వాలని కోరినట్లు సమాచారం. అయితే, కొంత దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కల్యాణ్ కారు.. సియా బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆమె ద్విచక్రవాహనంతో సహా రోడ్డుపై పడిపోయింది. బైక్ కొంత దూరం మేర నిప్పులు చిమ్ముకుంటూ ఈడ్చుకెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
దీనిపై గురుగ్రామ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులను సియా కుటుంబ సభ్యులు కలిశారు. ఘటన జరిగిన తీరు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, నిందితుడిపై హత్యాయత్నం సెక్షన్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. అలాగే అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కల్యాణ్‌పై పోలీసులు అదనపు సెక్షన్ జోడించగా.. అతని అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, సియా, కల్యాణ్ వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. తప్పు ఎవరిది అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
రూ.24 లక్షల ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. తరానా చౌహాన్ సాహసం!
అమిత్ షా యూసీసీ ప్రకటనపై ఆచితూచి స్పందిస్తున్న మిత్రపక్షాలు