గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడి అరెస్ట్
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:47 PM
గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో నిందితుడు కళ్యాణ్ బైన్స్లాను పోలీసులు రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. అరెస్టు అనంతరం టాయిలెట్‌కు వెళ్తానంటూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా కిందపడి స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టి పరారైన కేసులో నిందితుడు కళ్యాణ్ బైన్స్లాను రాజస్థాన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు అనంతరం టాయిలెట్‌కు వెళ్తానంటూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో కిందపడటంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయని, ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించినట్లు వెల్లడించారు.
గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై మహిళా బైకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు, బైన్స్లా ఉద్దేశపూర్వకంగానే కారుతో మహిళా బైకర్‌ను ఢీకొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో అతడిపై బీఎన్‌ఎస్ సెక్షన్ 109 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
హర్యానాలోని పల్వాల్ జిల్లా చంధాత్‌కు చెందిన 33 ఏళ్ల బైన్స్లా కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సెప్టెంబరు 15న రాజస్థాన్‌లోని దౌసా, రాజ్‌గఢ్ మధ్య ప్రాంతంలో క్రైమ్ బ్రాంచ్ సోహ్నా బృందం అతడిని అదుపులోకి తీసుకుంది. ఘటన తర్వాత అతడు తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
పరారయ్యే ముందు బైన్స్లా ఈ ఘటనపై మీడియాతో మాట్లాడినట్లు పోలీసులు చెప్పారు. తాను బైకర్‌ను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టలేదని, వేగం తగ్గించుకోవాలని మాత్రమే చెప్పానని అతడు పేర్కొన్నాడు. ఘటనకు కొద్దిసేపటి ముందు బైన్స్లా తనను దూషించాడని బాధితురాలు ఆరోపించినట్లు గురుగ్రామ్ డీసీపీ (ఈస్ట్) సందీప్ కుమార్ తెలిపారు. బైన్స్లా ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి, అనంతరం కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. పోలీసులు బైన్స్లాను అరెస్టు చేయడంతో పాటు ఘటనలో ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు అతడి స్నేహితుడి పేరుపై రిజిస్టర్ అయి ఉన్నట్లు తెలిపారు. బైన్స్లాతో పాటు ఉన్న మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని, ఘటనలో అతడి పాత్రపై విచారిస్తున్నారు.
Also Read:
FATF సమావేశానికి ముందే పాకిస్థాన్ 'ఉగ్ర' జిమ్మిక్కులు!
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు