Share News

క్యూఆర్‌తో సులువుగా ప్రింట్‌

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:40 AM

జిరాక్స్‌ సెంటర్లలో ప్రింట్లను తీయడంలో సంప్రదాయ విధానానికి స్వస్తిపలికి, వినియోగదారుడే నేరుగా బల్క్‌ ప్రింట్స్‌ను తీసుకునేవిధంగా ‘స్క్రింట్’ అనే యాప్‌ సిద్ధమైంది.

క్యూఆర్‌తో సులువుగా ప్రింట్‌

  • ఆటోమెటిక్‌ జిరాక్స్‌ యాప్‌ ‘స్క్రింట్’ను తయారు చేసిన గుంతకల్లు టెకీ

  • జిరాక్స్‌ షాపుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి

గుంతకల్లు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జిరాక్స్‌ సెంటర్లలో ప్రింట్లను తీయడంలో సంప్రదాయ విధానానికి స్వస్తిపలికి, వినియోగదారుడే నేరుగా బల్క్‌ ప్రింట్స్‌ను తీసుకునేవిధంగా ‘స్క్రింట్’ అనే యాప్‌ సిద్ధమైంది. ఈ యాప్‌ను అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన టెకీ పవన్‌ కుమార్‌ తయారు చేశారు. ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివిన ఆయన, తన తండ్రి జిరాక్స్‌ సెంటర్‌నే ప్రయోగాలకు వేదికగా మార్చుకుని యాప్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతానికి యాప్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచారు. నెల కిందట ప్రారంభించిన ఈ యాప్‌ను ఇప్పటివరకూ 205 మంది జిరాక్స్‌ సెంటర్ల నిర్వాహకులు వినియోగిస్తున్నారని పవన్‌ చెప్పారు.

స్క్రింట్ యాప్‌ను సులువుగా వాడుకోవచ్చన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. స్క్రింట్ యాప్‌ను జిరాక్స్‌ షాపుల నిర్వాహకులు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ప్రింట్‌కు ఎంత డబ్బు చార్జ్‌ చేయాలో యాప్‌లో నమోదు చేయాలి. తన ఇన్‌స్టలేషన్‌ ద్వారా లభించే క్యూఆర్‌ కోడ్‌ను షాపు బయట ఉంచాలి. వినియోగదారుడు వచ్చి తన సెల్‌ ఫోన్‌తో ఆ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, తన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ ఆప్షన్‌ని యాక్టివ్‌ చేయాలి.

ఆ వెంటనే కాపీల సంఖ్యను బట్టి పేమెంట్‌ డిమాండ్‌ వస్తుంది. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన వెంటనే ఈ యాప్‌కు అనుసంధానించిన జిరాక్స్‌ యంత్రం వెంటనే ప్రింట్లను ఇచ్చేస్తుంది. ప్రింట్‌ కోసం అప్‌లోడ్‌ చేసిన డాక్యుమెంట్‌ను నిమిషంలోపే యాప్‌కు అనుసంధానమైన ఏఐ ఏజెంట్‌ డిలీట్‌ చేసేస్తుంది. ఇలా కస్టమర్‌కు కూడా యాప్‌ భద్రత కల్పిస్తుంది. కస్టమర్లకు తన యాప్‌ ఎంతో ఉపకరిస్తుందని పవన్‌ కుమార్‌ తెలిపారు. వినియోగదారుల ప్రైవసీని కాపాడి, జిరాక్స్‌ సేవలను అందించే లక్ష్యంతో యాప్‌కు రూపకల్పన చేశామన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 12:51 AM