గుజరాత్‌లో దారుణం.. మంత్రిగత్తె పేరుతో మహిళ కుటుంబంపై దాడి..
ABN , Publish Date - May 29 , 2026 | 07:46 AM
గుజరాత్ సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ వదంతులు వ్యాపించాయి. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.
గుజరాత్: సాంకేతిక యుగంలో మనుషులు చంద్ర మండలంపైకి వెళ్తున్నా కొంత మందిని మూఢనమ్మకాలు మాత్రం వీడడం లేదు. ఓ వైపు పూజల పేరుతో దొంగ బాబాలు అమాయకులను మోసం చేస్తుంటే.. మరోవైపు చేతబడి, బాణామతి పేరుతో పలువురిపై మూకదాడులు జరుగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే గుజరాత్‌లో చోటుచేసుకుంది. మంత్రగత్తె పేరుతో ఓ మహిళపై దాడి చేసేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా.. అడ్డుకోబోయిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సబర్‌కాంత జిల్లా గడివక్డ్‌లో మనుభాయ్ రామ్‌జీభాయ్ దామోర్, కమ్లాబెన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొన్ని నెలలుగా కమ్లాబెన్ మంత్రగత్తె అంటూ గ్రామంలో వదంతులు వ్యాపించాయి. కొంత మంది గ్రామస్థులు ఆ పుకార్లను నమ్మారు. ఆ కుటుంబంపై దాడి చేసి ఊరి నుంచి తరిమేయాలని నిర్ణయించారు. దీంతో పదుల కొద్దీ జనం ఒక్కసారిగా కమ్లాబెన్ ఇంటిపైకి దూసుకెళ్లారు. ఆమె నివాసంపై రాళ్లు విసురుతూ భయాందోళనలు సృష్టించారు. భార్య, పిల్లలను కాపాడేందుకు మనుభాయ్ బయటకు వచ్చారు. దాడికి వచ్చిన వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో బాధిత కుటుంబంపై ఒక్కసారిగా గ్రామస్థులు మూకదాడికి పాల్పడ్డారు.
పదునైన ఆయుధాలతో మనుభాయ్‌పై దాడి చేశారు. ఈ ఘర్షణలో అతని తలకు తీవ్ర గాయాలు కాగా.. బాధిత కుటుంబంలోని మరో ఇద్దరూ గాయపడ్డారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించే లోపే మనుభాయ్ మృతిచెందాడు. రంగంలోకి దిగిన పోలీసులు మూకదాడికి పాల్పడిన 12 మంది గ్రామస్థులపై కేసు నమోదు చేశారు. ఎనిమిది మంది పురుషులను, నలుగురు మహిళలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు మూఢనమ్మకాలతో ప్రజల ప్రాణాలు తీయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు..