గుజరాత్‌లో వర్ష బీభత్సం: నీట మునిగిన కార్లు.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:40 PM
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. వల్సాడ్ జిల్లాలో వరదల కారణంగా పార్కింగ్‌లో ఉన్న 50కిపైగా కార్లు నీట మునగగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని దక్షిణ ప్రాంతమైన వల్సాడ్ జిల్లా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. పార్కింగ్ చేసిన కార్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. ముఖ్యంగా ఉంబర్‌గావ్ ప్రాంతంలో కేవలం 16 గంటల్లోనే 1,100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వాపి ప్రాంతంలోని ఓ భవనం పార్కింగ్ పూర్తిగా వరద నీటిలో మునిగిపోగా, అక్కడ నిలిపి ఉంచిన 50కిపైగా కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన డ్రోన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
భారీ వర్షాల కారణంగా వల్సాడ్ జిల్లాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఔరంగా, పార్, దమన్ గంగా నదులు పొంగిపొర్లడంతో వరదలు మరింత ఉధృతమయ్యాయి. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో అధికారులు వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సూరత్ నగరంలోని లోతట్టు ప్రాంతాల నుంచి కూడా 2,200 మందికిపైగా ప్రజలను ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
దక్షిణ గుజరాత్‌లోని వల్సాడ్, నవ్‌సారీ, డాంగ్స్, సూరత్, తాపి జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం, శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు పలువురు మంత్రులను వరద ప్రభావిత జిల్లాలకు పంపించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టు..
విద్యార్థులతో కేంద్రం చర్చలు జరపాలి: ప్రియాంక గాంధీ