విద్యార్థులతో కేంద్రం చర్చలు జరపాలి: ప్రియాంక గాంధీ
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:27 PM
విద్యార్థులు ప్రస్తుత వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయారని, వారి సమస్యలను పరిష్కరించడానికి వారితో నేరుగా మాట్లాడాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు.
ఢిల్లీ, జులై 23: పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో లోపాలపై జంతర్ మంతర్ వద్ద ఆందోళన బాట పట్టిన విద్యార్థుల డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ప్రస్తుత వ్యవస్థపై నమ్మకాన్ని కోల్పోయారని, వారి సమస్యలను పరిష్కరించడానికి వారితో నేరుగా మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.
విద్యార్థుల డిమాండ్లను వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రియాంక పేర్కొన్నారు. వ్యవస్థ అందించే అరకొర పరిష్కారాలను విద్యార్థులు ఇకపై అంగీకరించే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, దాడి ఘటనలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.
'మీరు సోషల్ మీడియాలో విద్యార్థులపై నమ్మకం ఉందని ట్వీట్లు చేస్తారు, కానీ రాత్రికి రాత్రే వారిపై లాఠీఛార్జ్ చేయిస్తారు. నిజంగా విద్యార్థులపై శ్రద్ధ ఉంటే నేరుగా పిలిచి మాట్లాడండి' అని ఆమె కేంద్రానికి సవాల్ విసిరారు. ప్రభుత్వ తీరును విమర్శిస్తూ ఒక ఉదాహరణ ఇచ్చారు: 'పిల్లలు డిజైనర్ అవుతానంటే, తండ్రి ఏమీ వినకుండా ఇంజనీరింగ్ కాలేజీలో సీటు బుక్ చేశానని చెప్పినట్లుగా ఉంది ప్రభుత్వ ప్రవర్తన' అని ప్రియాంక అన్నారు.
నాయకులు తమ భయాలను పక్కనబెట్టి.. జంతర్ మంతర్ వద్ద వేలాదిగా తరలివచ్చిన యువత ఆవేదనను వినాలని, విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఒక నూతన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీపై కేసీ వేణుగోపాల్ విమర్శలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. పేపర్ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని మోదీ ప్రకటనలపై ప్రజల్లో విశ్వసనీయత పోయిందని విమర్శించారు. నిజంగా విద్యార్థుల భవిష్యత్తుపై కాపాడే ఉద్దేశం ఉంటే, ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించి, ఆ తర్వాతే విద్యార్థులతో చర్చలకు కూర్చోవాలని వేణుగోపాల్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ట్రేడింగ్ పేరుతో రూ.15 కోట్లకు టోకరా
రాష్ట్రంలో మరో 4 కొవిడ్ కేసులు