పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
ABN , Publish Date - May 31 , 2026 | 04:29 PM
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్‌ఫాల్ గైన్స్ పన్నును కేంద్రం తగ్గించింది.
న్యూఢిల్లీ: ఆయిల్ కంపెనీలకు ఉపశమనం కలిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విండ్‌ఫాల్ గైన్స్ పన్ను (windfal gains tax)ను కేంద్రం తగ్గించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారంనాడు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా ఆదేశాల ప్రకారం పెట్రోలియం ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (SAED)ని లీటరుకు రూ.1.5 చొప్పున తగ్గించింది. డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ.13.5గా నిర్ణయించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఎగుమతులపై లీటరుకు రూ.9.50 పన్ను విధంచనున్నారు. సవరించిన రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
దేశీయ ఇంధన ధరల్లో మార్పు లేదు
దేశీయ మార్కెట్‌లో విక్రయించే పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులకే ఈ సవరణ వర్తిస్తుందని స్పష్టం చేసింది. మరో కీలక నిర్ణయం కూడా కేంద్రం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధించే రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను పూర్తిగా సున్నాకు తగ్గించింది. ఈ చర్య ఎగుమతిదారులపై పన్ను భారం తగ్గించనుంది.
విండ్‌ఫాల్ పన్ను అంటే..
దేశీయ మార్కెట్‌లో ఇంధన లభ్యతను నిర్ధారించడం, అంతర్జాతీయ ధరల వ్యత్యాసం వల్ల ఎగుమతిదారులు అధిక లాభాలు పొందకుండా నియంత్రించడానికి కేంద్రం ఈ విండ్‌ఫాల్ పన్నును ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ రేట్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వం సమీక్షిస్తుంటుంది. ప్రస్తుతం గ్లోబల్ చమురు మార్కెట్లు కొంత స్థిరత్వం దిశగా పయనిస్తుండటంతో ప్రభుత్వం విండ్‌ఫాల్ పన్నును తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
మంత్రులు, డిప్యూటీ సీఎంలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. మల్లికార్జున్ ఖర్గే
హిమాచల్ ప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ హవా