8.23 లక్షల ఉద్యోగాలు ఖాళీ!
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:49 AM
దేశంలో యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో...
ప్రభుత్వ శాఖల్లో భారీగా సిబ్బంది కొరత
భోపాల్, ఆగస్టు 23: దేశంలో యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో (ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు మినహా) 8.23 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఈ గణాంకాలను కేంద్రం ఇటీవల వెల్లడించింది. దేశవ్యాప్తంగా మంజూరైన మొత్తం పోస్టుల సంఖ్య 39,23,212కు గాను 2024 మార్చి1 నాటికి 30,99,556 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అంటే 8,23,656 (21ు) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఐదు పోస్టుల్లో ఒకటి కంటే ఎక్కువ ఖాళీలు ఉండటంతో ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం పెరిగిపోతోంది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలతో పాటు ప్రభుత్వంలోని దాదాపు అన్ని శాఖల్లోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అత్యధికంగా రక్షణ రంగంలో 2,42,243, రైల్వేలో 2,40,125, హోంశాఖలో 1,10,885, రెవెన్యూలో 69,662, తపాలా శాఖలో 61,546 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అణుశక్తి శాఖలో కూడ ఏకంగా 10,234 ఖాళీలున్నాయి. అలాగే పలు ఇతర శాఖల్లోనూ పెద్దసంఖ్యలో పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను ప్రారంభించాలని గౌర్ కోరారు. దీనివల్ల యువతకు ఉపాధి లభించడంతో పాటు శాఖల పనితీరు కూడా మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో భారతీయ వ్యాపారి హత్య.. నిందితుడి చిత్రాలు విడుదల..
అమెరికా ఒత్తిడికి తలవంచబోం.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు..