Share News

8 నెలల్లోనే.. 1.23 లక్షల మంది ఔట్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:48 AM

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధ పరిస్థితులు, ఉద్యోగులపై వ్యయాల తగ్గింపు, కృత్రిమ మేధపై...

8 నెలల్లోనే.. 1.23 లక్షల మంది ఔట్‌

  • టెక్‌ ఉద్యోగాల్లో భారీగా కోతలు!

  • గత ఏడాది మొత్తంగా తొలగించిన 1,22,606 ఉద్యోగుల కంటే ఎక్కువ

  • ఒరాకిల్‌, అమెజాన్‌, డెల్‌, మెటా వంటి ప్రముఖ సంస్థల్లో వరుసగా ఉద్వాసనలు

  • ఉద్యోగులపై వ్యయం తగ్గింపు, ఏఐ వైపు పెట్టుబడుల మళ్లింపే కారణం

  • ‘లేఆ్‌ఫ్సడాట్‌ ఎఫ్‌వైఐ’ నివేదికలో వెల్లడి

  • మిగతా 4 నెలల్లో మరెంతగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందోనన్న ఆందోళన

  • 3,300 మందిని తొలగించిన ఉబర్‌ ఒరాకిల్‌లో మరో 4 వేల కొలువుల కోత!

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధ పరిస్థితులు, ఉద్యోగులపై వ్యయాల తగ్గింపు, కృత్రిమ మేధపైపెట్టుబడుల కోసం ఒరాకిల్‌, అమెజాన్‌, మెటా వంటి దిగ్గజ టెక్‌ కంపెనీలు కూడా ఉద్యోగుల తొలగింపుపై దృష్టిపెడుతున్నాయి. ఈ ఏడాది (2026) జనవరి నుంచి ఆగస్టు చివరి వరకు ఎనిమిది నెలల్లోనే 289 కంపెనీలు లేఆఫ్‌ ప్రకటించి, 1,23,305 మంది ఉద్యోగులను తొలగించాయి. గత ఏడాది మొత్తంలో 278 కంపెనీలు 1,22,606 మంది ఉద్యోగులను తొలగించగా.. ఈసారి ఎనిమిది నెలల్లోనే ఆ సంఖ్య దాటిపోయుంది. మిగతా నాలుగు నెలల్లో మరెన్ని ఉద్యోగాల కోత ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల లేఆ్‌ఫలను పరిశీలించే ‘లేఆఫ్స్‌ డాట్‌ ఎఫ్‌వైఐ’ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. టెక్‌ కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడం, సంస్థలో వ్యవస్థలను సరళీకరించడం, కృత్రిమ మేధ (ఏఐ)తోపాటు డిమాండ్‌ ఎక్కువగా ఉన్న ఇతర రంగాలకు పెట్టుబడులను మళ్లించడంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయని తెలిపింది. చాలా కంపెనీలు టీమ్‌లను విలీనం చేయడం, మేనేజ్‌మెంట్‌ స్థాయిలను తగ్గించడం, కొన్ని రకాల పనులను ఆటోమేట్‌ చేయడం, ఏఐ దిశగా టీమ్‌లను పునర్వ్యవస్థీకరించడం వంటి చర్యలు చేపడుతున్నాయని వివరించింది.

లేఆఫ్‌లలోటాప్‌లో ఒరాకిల్‌

ఈ ఏడాది భారీగా ఉద్యోగులను తొలగించిన టెక్‌ కంపెనీల్లో ఒరాకిల్‌ టాప్‌లో నిలిచింది. ఆ సంస్థ ఎనిమిది నెలల్లో ఏకంగా 21 వేల మందిని ఇంటికి పంపించింది. అమెజాన్‌ 17,267, డెల్‌ 11 వేలు, మెటా 10,400, మైక్రోసాఫ్ట్‌ 4,800, పేపాల్‌, సిస్కో, బ్లాక్‌ వంటి సంస్థలు సుమారు 4వేల మంది చొప్పున ఉద్యోగులను తొలగించాయి. ఇన్‌ట్యూట్‌, వైస్‌టెక్‌, ఏఎ్‌సఎంఎల్‌, అట్లాసియన్‌, ఎరిక్సన్‌, లుసిడ్‌ మోటార్స్‌ వంటి ప్రముఖ సంస్థలూ ఈ ఏడాది ఉద్యోగులను తగ్గించుకున్నట్టు ‘లేఆఫ్స్‌ డాట్‌ ఎఫ్‌వైఐ’ సంస్థ వెల్లడించింది. జొమాటో కూడా 250 మందిని తొలగించాలని తాజాగా నిర్ణయించిందని తెలిపింది. ఇక ఒరాకిల్‌ సంస్థ మరో మూడు, నాలుగు వేల మందిని తొలగించే అంశాన్ని పరిశీలిస్తోందని.. కానీ నిర్ణయం వెలువడలేదని తెలిపింది. ఈ దఫా లేఆఫ్‌ ప్రకటిస్తే.. అందులో 3 వేల మంది వరకు భారత్‌లోని ఉద్యోగులే ఉండవచ్చని పేర్కొంది.


ఉబర్‌లో 3,300 మంది తొలగింపు

క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ తాజాగా 3,300 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మొత్తం ఉద్యోగులలో 10శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్టు తెలిపింది. కంపెనీలో మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించడం, రోబోట్యాక్సీ, రైడ్‌ షేరింగ్‌, డెలివరీ విభాగాలపై పెట్టుబడులను సమీక్షించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు కంపెనీ సీఈవో దారా ఖోస్రోషాహి ఉద్యోగులకు బుధవారం ఈ-మెయిల్‌ పంపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 06:35 AM