Share News

వివాదాల జడ్జి సీఎస్‌ కర్ణన్‌ కన్నుమూత

ABN , Publish Date - Nov 14 , 2026 | 04:50 AM

తన ఇంటినే కోర్టుగా మార్చి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు సుప్రీం కోర్టు జడ్జిలకు జైలు శిక్ష విధించి న్యాయవ్యవస్థలో సంచలనం రేపిన మద్రాసు, కలకత్తా హైకోర్టుల మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ కన్నుమూశారు.

వివాదాల జడ్జి సీఎస్‌ కర్ణన్‌ కన్నుమూత
karnon

చెన్నై, నవంబరు 13: తన ఇంటినే కోర్టుగా మార్చి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురు సుప్రీం కోర్టు జడ్జిలకు జైలు శిక్ష విధించి న్యాయవ్యవస్థలో సంచలనం రేపిన మద్రాసు, కలకత్తా హైకోర్టుల మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్‌ చిన్నస్వామి స్వామినాథన్‌ కర్ణన్‌ (71) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. సీఎస్‌ కర్ణన్‌ కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. దీంతో భారతదేశంలో జైలు శిక్ష అనుభవించిన తొలి సిట్టింగ్‌ జడ్జిగా నిలిచారు. 20 మంది సిట్టింగ్‌, రిటైర్డు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేస్తూ సీఎస్‌ కర్ణన్‌ 2017 జనవరిలో ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిపై నాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపి.. కర్ణన్‌ న్యాయాధికారాలను రద్దు చేసింది. కానీ, కోల్‌కతాలోని తన ఇంటినే కోర్టుగా మార్చిన కర్ణన్‌.. నాటి సీజేఐ సహా ఏడుగురు సుప్రీం కోర్టు జడ్జిలకు సమన్లు జారీ చేశారు. వారు నిర్దేశిత తేదీకి విచారణకు హాజరుకాకపోవడంతో ఆ న్యాయమూర్తులకు 2017 మే 8న జైలు శిక్ష విధించారు. ఆ తర్వాతి రోజే కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు.. సీఎస్‌ కర్ణన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2017 జూన్‌ 20 నుంచి ఆ ఏడాది డిసెంబరు వరకు ఆయన జైలులో ఉన్నారు. అనంతరం న్యాయమూర్తులపై, మహిళా న్యాయాధికారులపై అనుచిత వ్యాఖ్యలతో వీడియోలు విడుదల చేశారన్న ఆరోపణతో చెన్నై పోలీసులు 2020 డిసెంబరులో ఆయనను అరెస్టు చేశారు. ఈ కేసులో 2021 మార్చిలో బెయిల్‌పై విడుదలయ్యారు.

ఇవి కూడా చదవండి..

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు.. రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మ‌ృతి.. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్టు

Updated Date - Nov 14 , 2026 | 04:50 AM