ఫారం 6 వివాదం.. చిక్కుల్లో ఎన్నికల సంఘం
ABN , Publish Date - Oct 06 , 2026 | 07:20 PM
ఫారం 6 వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని తాజాగా సుప్రీం కోర్టు చేసిన హెచ్చరికలతో ఈసీ చిక్కుల్లో పడింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫారం 6 వివాదం ముదురుతోంది. ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటే వాటిని రద్దు చేస్తామని తాజాగా సుప్రీం కోర్టు చేసిన హెచ్చరికలతో ఈసీ చిక్కుల్లో పడింది. ఫారం-6 సవరణలను తాము ఆమోదించలేదని, అవి చట్టవ్యతిరేకంగా ఉంటే రద్దు చేస్తామని నిన్న (సోమవారం) సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఫారం-6ను కొత్త ఓటర్ల నమోదు కోసం వినియోగిస్తారు. అయితే దీనిలో ఏకపక్షంగా సవరణలు చేశారని దేశవ్యాప్తంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఫారం 6లో.. గత ఎస్‌ఐఆర్‌లో తమ పేరు/ తల్లిదండ్రుల పేరు/ తాత, నానమ్మల పేరు ఉందా అన్న విషయం తెలపాలంటూ ఈసీ సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీం కోర్టు ఘాటుగా స్పందించింది. ఆ సవరణలను తాము ఆమోదించలేదని స్పష్టం చేసింది.
ఫారం-6ను మార్చలేదు..
మరోవైపు ఫారం-6 ఎలాంటి సవరణలూ చేయలేదని ఎన్నికల సంఘం కోర్టులో వాదించింది. తాము అదనంగా ఒక డిక్లరేషన్‌ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేశామని చెప్పింది. పైగా ఈ మార్పులను బిహార్ 'సర్'పై ఇచ్చిన మే నెల తీర్పులో సుప్రీం కోర్టు కూడా సమర్థించిందని తెలిపింది.
ఈసీఐ పోర్టల్‌లో అదనపు డిక్లరేషన్ తప్పనిసరి
కాగా.. ఈసీఐ అధికారిక పోర్టల్‌లో ఫారం-6కు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ అదనపు డిక్లరేషన్ తప్పనిసరిగా జతచేయాలి. ఇందుకోసం ఆ పోర్టల్‌లో ‘ఫిల్ ఫారం-6’, ‘ఫిల్ డిక్లరేషన్’ అని రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు దీనిపై వివాదం రాజుకోవడంతో డిక్లరేషన్ ఆప్షన్‌ను ఈసీ తొలగించింది. ఇప్పుడు దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది, ఎవరి ఆదేశాలతో ఆ పత్రాన్ని తప్పనిసరి చేశారని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీ పలు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.
ఈ వార్తలూ చదవండి
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్