Share News

ఆహార భద్రతా అధికారిపై తిరగబడ్డ జనం.. గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ ఆందోళన!

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:03 AM

ఆహార భద్రతా అధికారికి చేదు అనుభవం ఎదురైంది. లంచం తీసుకుంటూ గడువు తీరిన తినుబండారల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నాడని జనం చుట్టు ముట్టారు. అంతేకాక గడువు తీరిన బిస్కెట్లను అయనతో తినిపించేందుకు ప్రయత్నించారు.

ఆహార భద్రతా అధికారిపై తిరగబడ్డ జనం.. గడువు తీరిన బిస్కెట్లు తినాలంటూ ఆందోళన!
Maharashtra news

మహారాష్ట్ర, ఆగస్టు 29: ఛత్రపతి శంభాజీనగర్ జిల్లా విజయపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గడువు తీరిన బిస్కెట్లు తినాలని ఆహార భద్రతా అధికారిని స్థానికులు బలవంతం చేశారు. గడువు తీరిన తినుబండారాలు విక్రయిస్తున్న ఓ దుకాణదారుడికి.. లంచం తీసుకుని అధికారి సహకరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక దుకాణాలను తనిఖీ చేసేందుకు వచ్చిన సదరు అధికారిని అక్కడి జనం చుట్టుముట్టారు. ఆ బిస్కెట్లు తినాలంటూ అధికారిని బలవంతం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


స్థానికంగా ఉన్న ఓ పాన్ షాపులో కొనుగోలు చేసిన మిక్చర్ తిని రెండేళ్ల చిన్నారి అస్వస్థతకు గురికావడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఆ ప్యాకెట్‌లోని ఆహారం పదార్ధం తిన్న చిన్నారి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆగ్రహం చెందిన బంధువులు, స్థానికులు ఎఫ్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు.


దీంతో తనిఖీలకు వచ్చిన అధికారి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న దుకాణంలో గడువు తీరిన కొన్ని బిస్కెట్ ప్యాకెట్లను గుర్తించారు. అయితే, చిన్నారి అస్వస్థతకు కారణమైన ప్యాకెట్లను అధికారులు వచ్చేసరికి దుకాణదారుడు మాయం చేశాడని స్థానికులు ఆరోపించారు. కేవలం నామమాత్రంగా కొన్ని బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారంటూ జనం మండిపడ్డారు. భారీగా లంచం తీసుకొని షాపు యజమానిని అధికారి రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన జనం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని చుట్టుముట్టారు. ఆ బిస్కెట్లు మంచివే అయితే మీరే తిని చూపాలంటూ ఆందోళన దిగారు. కొందరైతే ఆ గడువు తీరిన బిస్కెట్లను ఆ అధికారి నోట్లో బలవంతంగా కుక్కేందుకు ప్రయత్నం చేశారు. కాగా, మహారాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్‌డీఏ అధికారులు కల్తీ ఆహారం, గడువు తీరిన ఉత్పత్తుల విక్రయాలపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో ఈ ఘటన జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్!

పాంటింగ్ రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్..

Updated Date - Aug 29 , 2026 | 11:33 AM