Share News

సుప్రీం కొత్త జడ్జీలుగా ఐదుగురి ప్రమాణం

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:36 AM

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ శీల్‌ నాగు, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌, జస్టిస్‌ అరుణ్‌ పళ్లీ, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ, సీనియర్‌ మహిళా న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహనలతో...

సుప్రీం కొత్త జడ్జీలుగా ఐదుగురి ప్రమాణం

న్యూఢిల్లీ, జూన్‌ 2: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా ఐదుగురు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్‌ శీల్‌ నాగు, జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌, జస్టిస్‌ అరుణ్‌ పళ్లీ, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ, సీనియర్‌ మహిళా న్యాయవాది వెంకిట సుబ్రమణి మోహనలతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రమాణం చేయించారు. జస్టిస్‌ సుబ్రమణి మోహన బార్‌ అసోసియేషన్‌ నుంచి నేరుగా బెంచ్‌కు ఎంపికయ్యారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరుకుంది. ఫుల్‌ బెంచ్‌కు ఒక్కరే తక్కువ ఉన్నారు. న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు (సీజేఐకు మినహాయింపు) పెంచుతూ, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చిన తర్వాత జరిపిన తొలి ఎంపికలివి. మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్‌ శీల్‌ నాగు ప్రస్తుతం పంజాబ్‌-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఢిల్లీకి చెందిన జస్టిస్‌ శ్రీ చంద్రశేఖర్‌ బొంబాయి హైకోర్టుకు; పంజాబ్‌కు చెందిన జస్టిస్‌ అరుణ్‌ పళ్లీ జమ్ము-కశ్మీర్‌-లద్దాఖ్‌ హైకోర్టుకు, ఢిల్లీకి చెందిన జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఇక, బార్‌ అసోసియేషన్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు సీనియర్‌ అడ్వకేట్‌ మోహన ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన రెండో మహిళా న్యాయమూర్తిగా ఆమె నిలిచారు. జస్టిస్‌ మోహనకు ముందు జస్టిస్‌ ఇందూ మల్హోత్రాను 2018లో కొలీజియం ఈ తరహాలోనే ఎంపిక చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన జస్టిస్‌ మోహన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. వెంకిట సుబ్రమణి అయ్యర్‌, కావేరి అమ్మాళ్‌ దంపతుల 13 మంది సంతానంలో ఆమె 11వ అమ్మాయి. ఆర్మీలో పనిచేసిన తండ్రి, ఆ తర్వాత సుదీర్ఘకాలం దేవదాయ శాఖలో సేవలు అందించారు. మొహన 1983లో కోయంబత్తూరు న్యాయ కళాశాలలో ఐదేళ్ల బీఏ-ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేశారు. కేంద్ర ప్రభుత్వం అదే సంవత్సరం కొత్తగా ఈ కోర్సును ప్రవేశపెట్టింది. కాలేజీలోని 83 మంది విద్యార్థుల్లో ఆమెతో కలుపుకొని కేవలం తొమ్మిదిమంది మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. 1988లో ఆమెతోపాటు బయటకువచ్చిన తొలి బ్యాచ్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ కూడా ఉన్నారు. జస్టిస్‌ విశ్వనాథన్‌ కూడా 2023లో నేరుగా బార్‌ నుంచే సుప్రీంకోర్టుకు ఎంపిక కావడం గమనార్హం. న్యాయవిద్యను పూర్తి చేసుకున్న తర్వాత జస్టిస్‌ మోహన సుదీర్ఘకాలం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. కాగా, సుప్రీంకోర్టు బెంచ్‌లో ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న. ఆమె కొలీజియం సభ్యురాలిగా కూడా ఉన్నారు.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 06:36 AM