ఐదు రోజుల్లో 30 వేల మంది మృతి
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:27 AM
ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో గత కొన్ని రోజులుగా అతి తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లోని...
మండిపోతున్న ఉత్తర, మధ్య, తూర్పు భారతం
45 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
ఒక్క యూపీలోనే 8,100 మంది కన్నుమూత
న్యూఢిల్లీ, జూన్ 2: ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో గత కొన్ని రోజులుగా అతి తీవ్రమైన వడగాడ్పులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతూనే ఉన్నాయి. తీవ్రమైన వేడి ఒక్క రోజులో దేశవ్యాప్తంగా సుమారు 3,400 అదనపు మరణాలకు కారణమవుతోంది. వడగాడ్పులకు ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా 30వేల మంది మరణించారు. తాజా అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 10నగరాల్లో ఎండ ప్రభావంతో సంభవించిన మరణాలను ఈ అధ్యయనంలో విశ్లేషించారు. ఫ్రంటియర్స్ ఇన్ ఎన్విరోన్మెంటల్ హెల్త్ జర్నల్‌లో ఈ వివరాలను ప్రచురించారు. నిర్దిష్ట కాలంలో సంభవించిన మొత్తం మరణాలు, చారిత్రక డేటా ఆధారంగా అంచనా వేసిన మరణాల మధ్య వ్యత్యాసాన్ని అదనపు మరణాలుగా పరిశోధకులు పేర్కొన్నారు. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే ఐదు రోజుల్లో వడగాడ్పుల వల్ల 8,100 అదనపు మరణాలు సంభవించాయని ఇండియా ఎనర్జీ, అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ, బెర్కెలీలోని క్లైమేట్ సెంటర్‌కు చెందిన పరిశోధకులు పీయూష్ నారంగ్, అశోక్ గాడ్గిల్ పేర్కొన్నారు. అలాగే, అహ్మదాబాద్, జైపూర్, సూరత్ సహా ఒక్కో జిల్లాలో వడగాడ్పులకు 250కిపైగా అదనపు మరణాలు సంభవించాయని తెలిపారు. దేశంలో అత్యధిక మరణాలు సంభవించిన ఐదు(యూపీ, బిహార్, ఎంపీ, రాజస్థాన్, గుజరాత్) రాష్ట్రాల్లో మరణాలు, ఆర్థిక సామర్థ్యం మధ్య 2.3 రెట్ల వ్యత్యాసం ఉందని విశ్లేషించారు. దేశవ్యాప్త అదనపు మరణాల్లో 66ు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదవగా, దేశ జీడీపీలో ఆ రాష్ట్రాల వాటా 29ు మాత్రమేనని పేర్కొన్నారు. అదనపు మరణాల్లో 44ు వరకు దేశ జనాభాలో మూడో వంతు కలిగి ఉన్న టాప్ 100 జిల్లాల్లోనే నమోదయ్యాయన్నారు.
Also Read:
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...
For More Latest News