మొదట ఓట్ చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:30 PM
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పార్టీ పేరు, ‘పువ్వులు-గడ్డి’ గుర్తును ఈసీ తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేలా ఉందని ఈసీపై ఆయన మండిపడ్డారు.
ఇంటర్‌నెట్ డెస్క్: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే నెల 6న జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పేరు, పువ్వులు-గడ్డి గుర్తును ఈసీ తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్‌లో ఆయన పోస్టు చేశారు. ‘మొదట ఓట్లను చోరీ చేశారు. తర్వాత ప్రభుత్వాలను చోరీ చేశారు. ఇప్పుడు పార్టీని దొంగిలిస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యం దిగజారిపోతోందనడానికి తాజా పరిణామాలు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా బీజేపీ, ఎన్నికల సంఘం చేతులు కలుపుతాయని, తర్వాత పార్టీల గుర్తులను తొలగిస్తారని ఆయన మండిపడ్డారు. గతంలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ ఇలాగే జరిగిందన్నారు.
ప్రజల తీర్పును ఈసీ కాలరాస్తున్నది..
ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడాల్సిన రాజ్యాంగబద్ధ బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, కానీ.. అందుకు విరుద్ధంగా ప్రజల తీర్పును మార్చే శక్తులకు ఈసీ సహకరిస్తోందని రాహుల్ విమర్శించారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని కోరుకునే ప్రతి పార్టీ, ప్రతి ఓటరు కోసం తాము పోరాడుతున్నామని పేర్కొన్నారు. కాగా.. గురువారం రాత్రి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రెజినగర్ ఉప ఎన్నికల్లో టీఎంసీ పేరు, పువ్వులు-గడ్డి గుర్తును ఉపయోగించరాదని టీఎంసీని ఎన్నికల సంఘం ఆదేశించింది. మమతా బెనర్జీ వర్గం, బెంగాల్ ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ వర్గం రెండూ టీఎంసీ పేరుతోనే అభ్యర్థులను బరిలోకి దించాయి.
ప్రధానికి జ్ఞానేశ్ కుమార్ బర్త్‌డే గిఫ్ట్..
ఎన్నికల సంఘం విధించిన గడువు శుక్రవారం ఉదయం 11 గంటలకు ముగియడానికి ముందు మమతా బెనర్జీ వర్గం ప్రత్యామ్నాయ పార్టీ పేరు, గుర్తును సమర్పించింది. అయితే, ఎన్నికల సంఘం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుపై మమత వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతకుముందు గురువారం కాంగ్రెస్ కూడా ఈసీ చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. టీఎంసీ గుర్తును కాలరాయడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ అర్ధరాత్రి పుట్టినరోజు కానుక సమర్పించారని విమర్శించింది.
Also Read:
గ్రిల్‌లో చిక్కాడు.. కర్రలతో చితకబాదారు.. వీడియో వైరల్
కేసులకు భయపడం.. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
ఆసియా క్రీడల్లో జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, కోచ్ అశోక్ మిశ్రాకు షాకింగ్ అనుభవం..