Share News

ఢిల్లీ దిశగా రైతుల మార్చ్‌!

ABN , Publish Date - Jul 22 , 2026 | 06:01 AM

ప్రతిపాదిత ‘అమెరికా-భారత్‌-వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రాజధాని ఢిల్లీ దిశగా కదం తొక్కారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ మంగళవారం ఢిల్లీలో తలపెట్టిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’కు ..

ఢిల్లీ దిశగా రైతుల మార్చ్‌!

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌ను

వ్యతిరేకిస్తూ ‘మహాపంచాయత్‌’

నిర్వహించేందుకు రెడీ

డీల్‌తో తమకునష్టమని ఆందోళన

పంజాబ్‌ రైతులను ‘శంభు’ వద్ద

అడ్డుకున్న హరియాణా పోలీసులు

వారితో ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి

భేటీ.. ఆయన హామీలతో వెనక్కి

అంబాలా, జూలై 21: ప్రతిపాదిత ‘అమెరికా-భారత్‌-వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతులు రాజధాని ఢిల్లీ దిశగా కదం తొక్కారు. ఈ ఒప్పందాన్ని నిరసిస్తూ మంగళవారం ఢిల్లీలో తలపెట్టిన ‘కిసాన్‌ మహాపంచాయత్‌’కు బయల్దేరిన పంజాబ్‌ రైతులను పోలీసులు శంభు సరిహద్దుల్లో అడ్డుకున్నారు. ట్రేడ్‌ డీల్‌తో అమెరికా నుంచి వచ్చే కారుచౌక వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తుల కారణంగా.. దేశంలోని రైతులు, పాడిరైతుల జీవితాలు దెబ్బతింటాయని రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి తెలిపేందుకు ‘దేశ్‌ బచావో మోర్చా’ నేతృత్వంలో మంగళవారం ఢిల్లీలోని కిసాన్‌ఘాట్‌ వద్ద ‘మహా పంచాయత్‌’ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అమెరికాతో జరుపుతున్న వాణిజ్య చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పారదర్శకతా పాటించట్లేదని.. రైతులు, పాడి పరిశ్రమకు చెందిన కార్మికులను, లఘుపరిశ్రమలకు చెందినవారిని సంప్రదించకుండానే చర్చల్లో పాల్గొంటోందని.. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ నేత సర్వణ్‌ సింఘ్‌ పాంధర్‌ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రతిపాదిత ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలనూ బయటపెట్టాలని, ఈ డీల్‌ వల్ల దీర్ఘకాలంలో స్థానిక రైతులపై పడే ప్రభావం గురించి వివరణ ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన డిమాండ్‌ చేశారు. అమెరికా నుంచి సోయాబీన్స్‌, మొక్కజొన్న, యాపిల్స్‌, బాదంపప్పులు, పత్తి, పాల ఉత్పత్తులు దేశీ మార్కెట్లను ముంచెత్తుతాయని.. స్థానిక రైతులు ఆ పోటీని తట్టుకోవడం కష్టమని సర్వణ్‌ సింగ్‌ పాంధర్‌ ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో 8కోట్ల గ్రామీణ కుటుంబాలు పాడిపరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నాయని.. డెయిరీ మార్కెట్‌ను అమెరికా ఉత్పత్తులకు బార్లా తెరిస్తే ఆ కుటుంబాలు దెబ్బతింటాయని వాపోయారు. దీనిపై ఢిల్లీలో మహాపంచాయత్‌ ద్వారా నిరసన తెలిపేందుకు రైతు సంఘాల నేతలు సిద్ధమయ్యారు. దీనికి పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి వేలాదిగా రైతులు తరలివస్తారని ప్రకటించారు. ఈ క్రమంలోనే.. పంజాబ్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన వెయ్యిమందికిపైగా రైతులను పోలీసులు శంభు సరిహద్దుల్లో ఆపేశారు. పంజాబ్‌లోని ఖనౌరీ సరిహద్దుల వద్ద, కురుక్షేత్రలోని షాహాబాద్‌ వద్ద, కర్నాల్‌ వద్ద కూడా పోలీసులు ఆపేశారని రైతు నేతలు ఆగ్రహించారు. తాము శాంతియుతంగా ఢిల్లీకి వెళ్దామనుకుంటే నాయబ్‌ సింగ్‌ సైనీ (బీజేపీ) ప్రభుత్వం తమను ఆపేసిందని పాంధర్‌ మండిపడ్డారు.


అనంతరం.. హరియాణా వ్యవసాయశాఖ మంత్రి శ్యామ్‌సింగ్‌ రైనా.. రైతు నేతలతో మాట్లాడారు. ఆ భేటీ వివరాలను పాంధర్‌ మీడియాకు వెల్లడించారు. పోలీసుల అదుపులో ఉన్న రైతులను, గుర్నాం సింగ్‌ చారునిని విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో వారం-పదిరోజుల్లో భేటీ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారని.. వెల్లడించారు. మంత్రి హామీ మేరకు గుర్నాంసింగ్‌ చారుని సహా ఇతరులను విడుదల చేయడంతో.. సాయంత్రం 6 గంటల సమయంలో రైతులు తమ నిరసనను ముగించి వెనుదిరిగారు. కాగా.. రైతులను హరియాణా పోలీసులు అడ్డుకోవడంపై పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను కేంద్రం చర్చలకు పిలవాలన్నారు.

రెండో రోజూ స్తంభించిన పార్లమెంట్‌

నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌, రామ మందిర విరాళాల చోరీ తదితర అంశాలపై చర్చకు పట్టుపడుతూ ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో పార్లమెంట్‌ ఉభయసభలు మంగళవారం రెండో రోజు కూడా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా వాయిదా పడ్డాయి. కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిని ప్రశ్నించాయి. తాను నిబంధనల ప్రకారం సభ్యులు మాట్లాడేందుకు అనుమతిస్తానని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చెప్పినప్పటికీ ప్రతిపక్షాలు నినాదాలు చేయడం ఆపలేదు. రాజ్యసభలోనూ ఇవే పరిస్థితులు తలెత్తాయి. దీంతో, ఉభయ సభలను బుధవారానికి వాయిదా వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

ప్రభుత్వ అధీనంలోనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు

తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!

Updated Date - Jul 22 , 2026 | 06:01 AM