బ్యాంకాక్ నుంచి గంజాయి స్మగ్లింగ్.. కేరళ మోడల్ అరెస్ట్
ABN , Publish Date - Jun 12 , 2026 | 03:27 PM
మోడలింగ్ రంగంలో రాణిస్తూ.. ప్రముఖ అందాల పోటీల్లో పాల్గొన్న ఓ కేరళ యువతి, ఒక్క రాత్రిలో డ్రగ్స్ స్మగ్లర్‌గా మారి జైలుపాలైంది.
ముంబై, జూన్ 12: మోడలింగ్ రంగంలో రాణిస్తూ.. కేరళ అందాల పోటీల్లో పాల్గొన్న ఓ యువతి, ఒక్క రాత్రిలో డ్రగ్స్ స్మగ్లర్‌గా మారి జైలుపాలైంది. బ్యాంకాక్ నుంచి ముంబైకి రూ.11.82 కోట్ల విలువైన హై-క్వాలిటీ ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని స్మగ్లింగ్ చేస్తూ.. మాజీ 'మిసెస్ కేరళ' కంటెస్టెంట్ హర్ష సన్నీ (28) ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయింది.

ఎయిర్ ఇండియా విమానం (TG-351) ద్వారా బ్యాంకాక్ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హర్ష సన్నీ చేరుకుంది. లగేజీ క్లియరెన్స్ సమయంలో ఆమె ప్రవర్తన కాస్త అనుమానాస్పదంగా ఉండటాన్ని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ అధికారులు గమనించారు.
ఆమెను పక్కకు పిలిచి, ఆమె వద్ద ఉన్న ట్రావెల్ బ్యాగ్‌ను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఆ బ్యాగులో ప్యాక్ చేసిన 12 ప్లాస్టిక్ ప్యాకెట్లు కనిపించాయి. వాటిలో పచ్చటి పదార్థం ఉంది. వెంటనే అధికారులు ‘ఎన్‌డిపిఎస్’ (NDPS) కిట్‌తో కెమికల్ టెస్ట్ చేయగా, అది అత్యంత ఖరీదైన, నాణ్యమైన ‘హైడ్రోపోనిక్ మారిజువానా’ (గంజాయి) అని తేలింది.

సాధారణ గంజాయితో పోలిస్తే ల్యాబ్‌లలో నియంత్రిత వాతావరణంలో పెంచే ఈ హైడ్రోపోనిక్ గంజాయికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్, ధర ఉంటుంది. హర్ష సన్నీ వద్ద దొరికిన 11 కిలోల గంజాయి విలువ అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో సుమారు రూ.11.82 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఆమెపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇవి కూడా చదవండి..
మీనాక్షికి దక్కని ఊరట.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం
పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ క్లారిటీ.. ప్రజలు ఓకే అంటేనే..