చందాదారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త!
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:43 AM
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త. దాదాపు 8కోట్ల మంది సభ్యుల కోసం పీఎఫ్ నిబంధనలను సమూలంగా మారుస్తూ ఈపీఎ్‌ఫవో కీలక ప్రకటన విడుదల చేసింది...
నెలవారీ చందాను నిర్ణయించుకొనే చాన్స్
ఉద్యోగి కచ్చితంగా కట్టాల్సింది రూ.1,800
అంతకుమించి ఎంతైనా స్వచ్ఛందంగా జమ
కంపెనీ కూడా అంతే ఇవ్వాలన్న రూల్ లేదు
ఈపీఎఫ్ స్కీమ్- 2026లో కీలక మార్పులు
న్యూఢిల్లీ, జూలై 2: ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారులకు శుభవార్త. దాదాపు 8కోట్ల మంది సభ్యుల కోసం పీఎఫ్ నిబంధనలను సమూలంగా మారుస్తూ ఈపీఎ్‌ఫవో కీలక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు తమ జీతం నుంచి ఎంత మొత్తాన్ని పీఎఫ్ కింద దాచుకోవాలో నిర్ణయించుకొనే స్వేచ్ఛను కల్పించింది. ప్రస్తుతం నెలకు రూ.15 వేలుగా ఉన్న చట్టబద్ధమైన వేతన పరిమితి వరకు 12శాతం వాటా చెల్లించడం తప్పనిసరి. అంటే ఇప్పటి వరకూ పీఎఫ్ కింద గరిష్ఠంగా రూ.1,800 కట్ అవుతోంది. ఒకవేళ ఉద్యోగి జీతం రూ. లక్ష ఉన్నా ఈ మొత్తం కచ్చితంగా కట్టాల్సిందే. వారు పనిచేసే సంస్థ కూడా అంతే మొత్తం తన వాటా కింద చెల్లిస్తోంది. తాజాగా అమల్లోకి వచ్చిన ఉద్యోగ భవిష్య నిధి పథకం-2026 ప్రకారం.. పదవీ విరమణ నిధిని మరింత పెంచుకోవాలనుకొనే వారు ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని పీఎ్‌ఫలో జమ చేసుకొనే అవకాశం కల్పించారు. తమ జీతంలో పీఎఫ్ కింద ఎంత కట్ చేయాలనేది ఉద్యోగులే స్వయంగా నిర్ణయించుకోవచ్చు. ఈ అదనపు మొత్తాన్ని స్వచ్ఛంద పీఎ్‌ఫగా పరిగణిస్తారు. దీనికి సమానంగా వారు పనిచేసే సంస్థ కూడా అంతే మొత్తం తప్పనిసరిగా జమ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ అదనపు చందాను ఉద్యోగులు ఎప్పుడైనా తగ్గించుకోవచ్చు లేదా పూర్తిగా నిలిపివేసే అవకాశం కూడా ఉంది.
విత్‌డ్రా కేటగిరీలు మూడే
ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ఇంతకుముందు 13 కేటగిరీలు ఉండేవి. ఈపీఎ్‌ఫ-2026లో వాటిని మూడుకు కుదించారు. ఇకపై అత్యవసర అవసరాలు (అనారోగ్యం, విద్య, వివాహం), గృహ సంబంధిత అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు అనే విభాగాల కింద సభ్యులు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగులు తమ ఖాతాలో నుంచి ‘అర్హత కలిగిన కనీస నిల్వ’లో 100శాతం వరకూ ముందస్తుగా ఉపసంహరించుకోవడానికి ఈపీఎ్‌ఫవో ఆమోదం తెలిపింది. అయితే భవిష్యత్తు, రిటైర్మెంట్ అవసరాల కోసం సభ్యుల ఖాతాల్లో కనీస నిల్వ కింద 25 శాతం ఎప్పుడూ ఉంచడం తప్పనిసరి. అర్హత కలిగిన క్లెయిమ్‌లను తగిన కారణం లేకుండా 20 రోజుల్లోగా పరిష్కరించకపోతే ఆ జాప్యానికి సంబంధిత ఈపీఎ్‌ఫవో కమిషనర్ బాధ్యులవుతారని పేర్కొంది. ఇటువంటి కేసుల్లో సదరు ప్రయోజన మొత్తంపై సంవత్సరానికి 12 శాతం చొప్పున వడ్డీని లెక్కించి జరిమానా విధించడంతో పాటు ఆ మొత్తాన్ని కమిషనర్ జీతం నుంచే వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది