కోటి కోట్లకు చేరువలో మస్క్
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:23 AM
అపర కుబేరుడు ఈలన్ మస్క్.. ఆధునిక చరిత్రలో ఏ మానవుడూ అందుకోలేని మైలురాయి దిశగా వేగంగా ప్రయాణిస్తున్నారు! ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఆస్తుల విలువలను...
12నఐపీవోకి రానున్న ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ
అది విజయవంతమైతే మస్క్ ఆస్తుల నికరవిలువ
ట్రిలియన్ డాలర్ల మార్కు దాటుతుందని అంచనా
అదే జరిగితే.. తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర
మన కరెన్సీలో ఆ సొమ్ము కోటి కోట్లకు పైమాటే
చాలా దేశాల జీడీపీ కన్నా మస్క్ సంపదే ఎక్కువ
గంటకు 9.5 కోట్ల చొప్పున నిరంతరాయంగా
ఖర్చుపెట్టినా మొత్తం ఖర్చవడానికి వందేళ్లకుపైనే!
అపర కుబేరుడు ఈలన్ మస్క్.. ఆధునిక చరిత్రలో ఏ మానవుడూ అందుకోలేని మైలురాయి దిశగా వేగంగా ప్రయాణిస్తున్నారు! ప్రపంచంలోని అత్యంత సంపన్నుల ఆస్తుల విలువలను లెక్కించి ర్యాంకింగులు ఇచ్చే ‘ఫోర్బ్స్’ గణాంకాల ప్రకారమైతే ఆయన ఆస్తుల నికర విలువ మన కరెన్సీ ప్రకారం ఇప్పటికే రూ.75 లక్షల కోట్లకు పైమాటే! దీనికితోడు ఇన్నాళ్లుగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉన్న ఆయన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ వచ్చే శుక్రవారం.. అంటే జూన్ 12న ఐపీవో (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు రాబోతోంది. అంటే షేర్ మార్కెట్లోకి రాబోతోంది. దాంట్లో ఆయనకు 50 శాతానికి పైగా వాటా ఉంది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో మస్క్ ఆస్తి ట్రిలియన్ డాలర్లను దాటుతుందని.. 1.11 ట్రిలియన్ డాలర్లు అవుతుందని అంచనా. తద్వారా ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ అవుతారు. అంటే లక్ష కోట్ల డాలర్ల మార్కును దాటిన వ్యక్తి. మన కరెన్సీలో చెప్పాలంటే.. కోటి కోట్ల రూపాయల మార్కును దాటేస్తారు. ఇక్కడో చిన్న చిక్కుంది. డాలర్ల లెక్క ప్రకారమైతే ఆయన ట్రిలియనీర్ అవుతారు కరెక్టే. మరి అదే మన రూపాయల లెక్కలో అయితే? కోటి కోట్లకు ఇంగ్లి్‌షలో ప్రత్యేక పదమేమీ లేదు. జస్ట్ మల్టీ ట్రిలియనీర్ అనాలి. అదే మన సంస్కృతంలో అయితే.. లక్ష కోట్లను ‘మహాపద్మం’ అంటారు. రూ.10లక్షల కోట్లను ‘క్షోణి’ అని.. రూ.100 లక్షల కోట్లను (అంటే కోటి కోట్లను) మహాక్షోణి అంటారు. అంచేత మస్క్‌ను సరదాగా ‘మహాక్షోణాధిపతి’ అనొచ్చేమో!! ఆయన ఆస్తి.. ప్రపంచంలోని పలు ప్రముఖ దేశాల వార్షిక జీడీపీ కంటే ఎక్కువ. అపర కుబేరుల జాబితాలో అగ్రస్థానాల్లో ఉండే అమెజాన్ అధిపతి జెఫ్‌బెజోస్, ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్, గూగుల్ సహవ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ల ఆస్తులన్నీ కలిపితేనే.. ట్రిలియన్ డాలర్ల మార్కు దాటుతుంది. అలాంటిది మస్క్ ఒక్కడి సంపదే ఇంచుమించుగా వారికి దరిదాపుల్లో ఉండడం గమనార్హం.
మస్క్ ఉండేది.. అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో. అమెరికాలోని అతిపెద్ద నగరాల జాబితాలో.. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్ తర్వాత మూడోస్థానంలో ఉన్న నగరం అది. ఆ సిటీలోని మొత్తం నివాస, వాణిజ్య భవనాలన్నింటి విలువా కలిపినా కూడా.. మస్క్ సంపద కన్నా తక్కువే!! ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్-50 స్పోర్ట్స్ టీమ్స్ విలువ 353 బిలియన్ డాలర్లు. మస్క్ కొనదల్చుకుంటే.. ఆ టీములన్నింటినీ ట్విట్టర్‌ని కొన్నంత ఈజీగా ఎడంచేత్తో కొనేయగలరు. ఒక మిలియన్ డాలర్లంటే.. మన కరెన్సీలో రూ.9.5 కోట్లు. గంటకు రూ.9.5 కోట్ల చొప్పున రోజుకు 24 గంటలూ, ఏడాదికి 365 రోజులూ ఖర్చు పెడుతూ పోయినా సరే.. ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలంటే 100 సంవత్సరాలకు పైగా పడుతుంది. ‘అరుణాచలం’ సినిమాలాగా..ఆ ఖర్చు పెట్టే డబ్బు నుంచి తిరిగి ఎలాంటి ఆదాయమూ రాకపోతేనే ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి వందేళ్లకు పైగా పడుతుంది. తిరిగి ఆదాయం వచ్చే లెక్కయితే.. ఇంకెన్నేళ్లు పడుతుందో..!
భారత్‌లో సంతానోత్పత్తి తగ్గడంపై మస్క్ ఆందోళన
న్యూయార్క్, జూన్ 7: భారత్‌లో సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతుండటంపై ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సంతానోత్పత్తి రేటు పునరుత్పత్తి (రీప్లే్‌సమెంట్) స్థాయి కంటే కిందకు పడిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘భారతదేశంలో సంతానోత్పత్తి రేటు పునరుత్పత్తి స్థాయి కంటే కిందకు పడిపోయింది. ముఖ్యంగా బాగా చదువుకున్న వర్గాల్లో ఈ రేటు ఎన్నో ఏళ్ల క్రితమే క్షీణించింది’’ అని మస్క్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘ఏఫ్ పోస్ట్’ అనే మీడియా సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసిన గణాంకాలను ప్రస్తావిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. సదరు సంస్థ నివేదిక ప్రకారం.. భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా సంతానోత్పత్తి రేటు ఇంతలా క్షీణించింది. కేవలం ఒక దశాబ్ద కాలంలోనే దేశ సంతానోత్పత్తి రేటు 2.3 నుంచి 1.9కి పడిపోయింది. మరీ ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ రేటు 1.2గా నమోదైంది. ఇది యూరప్ దేశమైన ఫిన్లాండ్ కంటే కూడా తక్కువ కావడం గమనార్హం.
ఈనెల 4న ప్రచురితమైన ‘ది ఎకనామిస్ట్’ పత్రిక కథనం ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. గతేడాది ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్‌ఎ్‌ఫపీఏ) విడుదల చేసిన ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025’ నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. భారత్‌లో సగటు సంతానోత్పత్తి రేటు 1.9కి పడిపోయిందని పేర్కొంది. సాధరణంగా ఒక తరం తర్వాత వచ్చే తరంలో జనాభా సమతుల్యత దెబ్బతినకుండా స్థిరంగా ఉండాలంటే పునరుత్పత్తి రేటు 2.1గా ఉండాలి. కానీ ప్రస్తుతం భారత్‌లో ఈ రేటు 1.9కి పడిపోయింది. అంటే, జనాభాను స్థిరంగా ఉంచడానికి అవసరమైన దానికంటే భారతీయ మహిళలు సగటున తక్కువ మంది పిల్లలను కంటున్నారని అర్థం. దీనివల్ల భవిష్యత్తులో దేశ జనాభా వేగంగా తగ్గే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News