‘సర్’ సాఫ్ట్వేర్ వివరాలివ్వలేం
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:50 AM
ఇప్పటికే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)’ ప్రక్రియకు సంబంధించి కొత్తగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
‘సర్’ సాఫ్ట్వేర్ వివరాలివ్వలేం
ఆర్టీఐ చట్టం ప్రకారం.. వాణిజ్య రహస్యాలు,
మేధోహక్కుల కింద వాటికి మినహాయింపు ఉంది
ఆర్టీఐ కింద తెలంగాణకు చెందిన సామాజిక
కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఈసీ సమాధానం
న్యూఢిల్లీ, అక్టోబరు 25: ఇప్పటికే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ‘ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)’ ప్రక్రియకు సంబంధించి కొత్తగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ‘సర్’ నిర్వహణలో భాగంగా ఓటరు జాబితాలో తప్పులు, లోపాలను గుర్తించడానికి వినియోగించిన సాఫ్ట్వేర్, దాని వెర్షన్ (లేదా) యాప్ (లేదా) ఏఐ ప్లాట్‌ఫామ్ పేరేమిటి? అనే వివరాలు ఇవ్వడానికి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిరాకరించింది. ఈ వివరాలు కోరుతూ.. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఎంఏ ముజీబ్ అయూబ్ అనే సామాజిక కార్యకర్త సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. ఓటర్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల్లో లోపాలు, తప్పులను సదరు సాఫ్ట్వేర్/ఏఐ ప్లాట్‌ఫామ్‌లు గుర్తించి దిద్దుబాట్లు, తొలగింపులు చేయాలని ఆటోమేటిగ్గా సూచిస్తాయా? ఈ ప్రక్రియలో ఏ దశలోనైనా ఏఐ, మెషీన్ లెర్నింగ్, ప్రెడిక్టివ్ ఎనలిటిక్స్, ఆటోమేటిక్ డెసిషన్ సపోర్ట్ టూల్స్ వినియోగిస్తున్నారా? నిజమైన ఓటర్లను తొలగించకుండా ఉండడానికి తీసుకున్న రక్షణ చర్యలేమిటి? ఎవరైనా ఒక ఓటరు రికార్డులో తప్పులున్నట్టు సాఫ్ట్వేర్ చూపిస్తే.. దాన్ని సమీక్షించే/ఆమోదించే అధికారి ఎవరు? తదితర వివరాలను అయూబ్ కోరారు. దీంట్లో మొదటి ప్రశ్నకు సమాధానంగా.. ఆ సమాచారమతా వాణిజ్య రహస్యాలు, మేధోహక్కులకు సంబంధించిందని, వాటికి సమాచార హక్కు చట్టం నుంచి మినహాయింపు ఉందని ఈసీఐ పేర్కొంది. అయితే, ఈ ప్రక్రియ కోసం కొత్తగా ఏ సాఫ్ట్‌వేర్‌నూ అభివృద్ధి చేయలేదని మాత్రం పేర్కొంది. దిద్దుబాట్లు, తొలగింపులకు సంబంధించి సాఫ్ట్‌వేరే ఆటోమేటిగ్గా సూచనలు ఇస్తుందా? నిజమైన ఓటర్లకు సంబంధించి అవి తప్పుడు సూచనలు చేయకుండా ఉండడానికి తీసుకున్న జాగ్రత్తలేమిటనే ప్రశ్నకు.. అది ఆర్టీఐ చట్టం కింద ‘సమాచారం’ అనే నిర్వచనం పరిధిలోకి రాదని, ‘వివరణ’ కిందకు వస్తుందని బదులిచ్చింది.
సాఫ్ట్వేర్ ఎత్తిచూపిన తప్పులు, లోపాలను ఎవరు సమీక్షించి, నిర్ణయంతీసుకుంటారనే ప్రశ్నకు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(జి) ప్రకారం సమాధానం చెప్పకర్లేదంది. ఒకరి గురించి ఇచ్చిన సమాచారం వల్ల వారి భద్రతకు ప్రమాదం ఏర్పడే ముప్పు ఉండే సందర్భాల్లో ఈ సెక్షన్ కింద సమాచారాన్ని ఇవ్వరు. అయితే, ఓటర్ల పేర్లను జాబితాలో ఉంచాలా లేక తీసేయాలా అనే నిర్ణయాన్ని ఈఆర్వోలే తీసుకుంటారని వివరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు.. ఎన్డీయే నేతల తీవ్ర ఆగ్రహం
యూపీలో దారుణం.. మరిది ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసిన వదిన