ఎల్‌నినో మరింత తీవ్రం
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:32 AM
ఇప్పటికే ఏర్పడ్డ ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని, జూలై, సెప్టెంబరు మధ్యలో అది ఉగ్రరూపం దాల్చుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ...
జూలై, సెప్టెంబరు మధ్య ఉగ్రరూపం.. ఎదుర్కోవడానికి దేశాలన్నీ సిద్ధం కావాలి
ఐరాస సంస్థ డబ్ల్యూఎంవో హెచ్చరిక
భారత్‌లోని వర్షపాతంలో తీవ్ర వైరుధ్యం
జూన్‌లో 79 శాతం భూభాగంలో లోటు
న్యూఢిల్లీ, జూలై 3: ఇప్పటికే ఏర్పడ్డ ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయని, జూలై, సెప్టెంబరు మధ్యలో అది ఉగ్రరూపం దాల్చుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. వచ్చే రోజుల్లో ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంటుందని పేర్కొంది. ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు సూచించింది. సాధారణంగా ఎల్‌నినో పరిస్థితిని బట్టి బలహీనం, మధ్యస్థం, తీవ్రం, అత్యంత తీవ్రంగా డబ్ల్యూఎంవో విభజిస్తుంది. ఈఏడాది ఎల్‌నినో పరిస్థితి తీవ్ర స్థాయికి చేరుకుంటుందని ఆ సంస్థ హెచ్చరించింది. కీలకమైన ప్రాంతాల్లో సగటు సముద్ర ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని అంచనా వేసింది. ఉత్తరార్ధగోళంలో వచ్చే శరదృతువులో ఎల్‌నినో మరింత బలపడుతుందని, దీని ప్రభావం ప్రపంచం అంతా పడుతుందని తెలిపింది. ఇదే సమయంలో భూమధ్య రేఖ వద్ద అట్లాంటిక్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం బలపడుతున్న ఎల్‌నినో కారణంగా పలు రీజియన్లలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో పాటు తీవ్రమైన వర్షపాతం, భూమి, సముద్రంపై తీవ్రమైన వేడిగాలుల ప్రభావం ఉంటుందని డబ్ల్యూఎంవో చీఫ్ సెలెస్టీ సాలో చెప్పారు. ఈ ఎల్‌నినో సమయంలో 60 డిగ్రీల ఉత్తరం, 60 డిగ్రీల దక్షిణం మధ్య ఉన్న భూ భాగంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదుకానుంది. జూలై, సెప్టెంబరు నెలల్లో అంచనా వేసిన వర్షపాతం కూడా ఎల్‌నినో బలపడుతోందనడానికి ఊతం ఇస్తోంది. నైరుతి అమెరికా ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువగా, భారత్ ఉపఖండం, ఆస్ట్రేలియాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షం కురుస్తుందని డబ్ల్యూఎంవో తెలిపింది. ఉత్తరార్ధగోళంలో వేసవి, ఎల్‌నినో పరిస్థితులతో మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతంలో హరికేన్లు చెలరేగుతాయి. అయితే అట్లాంటిక్ సముద్రంలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు.
భారత్‌లో పరిస్థితి ఏంటి?
దేశ వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర వైవిధ్యం కనిపిస్తోంది. ఒకవైపు రుతుపవనాల్లో మందకొడి తనంతో కరువు పరిస్థితులు నెలకొనగా, కొన్ని చోట్ల మేఘ విస్పోటం లాంటి పరిస్థితులతో వరదలు ముంచెత్తుతున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా చూస్తే ఈ సీజన్‌లో సుమారు 38 శాతం లోటు వర్షపాతం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రికార్డు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి జూలై 1 మధ్య వ్యవసాయం, జలాశయాల పరిస్థితి ఆందోళనకంగా ఉంది. దేశంలోని 29 రాష్ట్రాల పరిధిలో 79 శాతం భూభాగం లోటు లేదా తీవ్ర లోటు వర్షపాత ప్రాంతాలుగా నిలిచాయి. ఈ నెలలో సాధారణ సగటు 172.9 మిల్లీమీటర్ల వర్షపాతంగా ఉండగా, దేశంలో 108.1 మిల్లీమీటర్ల వర్షమే పడింది. అంటే దేశ వ్యాప్తంగా 37.5 శాతం వర్షపాత లోటు ఏర్పడిందని ఐఎండీ స్పష్టం చేసింది. దేశంలో ఐఎండీ పర్యవేక్షణలో 741 జిల్లాల్లోని 535 జిల్లాల్లో (72 శాతం) లోటు లేదా తీవ్ర లోటు వర్షపాత పరిస్థితులు ఉన్నాయి. కేవలం 201 జిల్లాల్లో (27 శాతం) మాత్రమే సాధారణం లేదా ఎక్కువ వర్షపాతం నమోదైంది.
కరువు పరిస్థితులు.. ఆందోళనలో రైతులు
దేశంలో చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. జూన్ ప్రారంభంలో పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నా, నెలాఖరుకు వచ్చే సరికి కరువు ఛాయలు విజృంభించాయి. దీంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులు చెరువులు, రిజర్వాయర్లపై ఆధారపడటం పెరగడం వల్ల అవి అడుగంటిపోయే అవకాశం కూడా ఉంది. మరోవైపు, దేశంలో లోటు వర్షపాతం, ఎల్‌నినో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలసి హోం మంత్రి అమిత్ షా శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర శాఖలన్నింటికీ సూచించారు.
జూన్1, జూలై1 మధ్యలో రుతుపవన
వర్షపాతం పరిస్థితులు ఇలా..
మధ్య ప్రాంతం : గరిష్ఠలోటు సాధారణం కంటే 45 శాతం తక్కువగా ఉంది.
తూర్పు, ఈశాన్య ప్రాంతం : సాధారణం కంటే 40 తక్కువతో పరిస్థితి విషమంగా ఉంది.
వాయవ్య ప్రాంతం : సాధారణం కంటే 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
దక్షిణ ప్రాంతం : సాధారణం కంటే 26 శాతం తక్కువగా వర్షం పడింది.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..