Share News

సర్‌లో పేరు గల్లంతైతే.. ఫారం-6 సమర్పించొచ్చు: ఎన్నికల సంఘం

ABN , Publish Date - Nov 04 , 2026 | 04:13 AM

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన వారు.. ఫారం-6ను సమర్పించడం ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పష్టం చేసింది.

సర్‌లో పేరు గల్లంతైతే..  ఫారం-6 సమర్పించొచ్చు: ఎన్నికల సంఘం
sir image

న్యూఢిల్లీ, నవంబర్‌ 3: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన వారు.. ఫారం-6ను సమర్పించడం ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) స్పష్టం చేసింది. సర్‌కు ముందు గత ఓటరు జాబితాలో పేరు ఉండి, కొత్త జాబితాలో పేరు లేని వారు.. తుది జాబితాలో చోటు పొందేందుకు వీలుగా, ఓటర్లలో ఉన్న గందరగోళానికి తెరదించుతూ ఈసీఐ వివరణ ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు లేఖ రాసింది. ‘‘ప్రస్తుతం కొనసాగుతున్న సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితాలో పేరు గల్లంతైన వారు ఫారం-6ను సమర్పించేందుకు వెనుకాడుతున్నారని మా దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఫారం-6తోపాటు, మొదటిసారి ఓటరుగా నమోదు చేసుకుంటున్నామన్న ధ్రువీకరణ కూడా ఇవ్వాల్సి ఉండడమే ఈ గందరగోళానికి కారణం. పాత ఓటర్లు ఫారం-6ను సమర్పించినట్టయితే వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 31 కింద చర్యలు తీసుకోవడం ఉండదు. కేవలం చట్టవిరుద్ధంగా, తప్పుడు ధ్రువీకరణలు ఇచ్చిన వారే చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’’అని ఈసీఐ స్పష్టం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

రూ.2,320 కోట్లతో తెలంగాణ ప్లాంట్‌ విస్తరణ

రిలయన్స్‌ జోరు.. 7 వారాల గరిష్ఠానికి సెన్సెక్స్‌

Updated Date - Nov 04 , 2026 | 04:14 AM