Share News

ఈ-20తో ఇంజిన్‌ భాగాలకు దెబ్బ!

ABN , Publish Date - Aug 06 , 2026 | 06:07 AM

ఈ-20 పెట్రోల్‌తో వాహనాలకు దెబ్బ తప్పదా? వాహనదారుల్లో నెలకొన్న ఈ అనుమానాలకు బలం చేకూరేలా ఈ-20 పెట్రోల్‌పై భారత ఆటోమొబైల్స్‌ తయారీదారుల సంఘం(సియామ్‌) తీవ్ర....

ఈ-20తో ఇంజిన్‌ భాగాలకు దెబ్బ!

  • ఇంధనంలో క్లోరైడ్‌, తేమ చాలా ఎక్కువ

  • తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సియామ్‌

  • కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ..

మంగళవారం ఆ లేఖ ఉపసంహరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఈ-20 పెట్రోల్‌తో వాహనాలకు దెబ్బ తప్పదా? వాహనదారుల్లో నెలకొన్న ఈ అనుమానాలకు బలం చేకూరేలా ఈ-20 పెట్రోల్‌పై భారత ఆటోమొబైల్స్‌ తయారీదారుల సంఘం(సియామ్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ-20 పెట్రోల్‌తో వాహనాలకు ముప్పు తప్పదని హెచ్చరించింది. ఈ-20 పెట్రోల్‌లో క్లోరైడ్‌, తేమ శాతం చాలా ఎక్కువగా ఉంటోందని.. ఫలితంగా ఇంధనంతో నేరుగా సంబంధం ఉండే ఫ్యూయల్‌ పంపులు, ఇంజెక్టర్లు, ఈజీఆర్‌ వాల్వ్‌లు, ఎగ్జాస్ట్‌ సిస్టమ్స్‌ వంటి ఇంజిన్‌లో కీలక భాగాలు త్వరగా పాడవుతున్నాయని, మరమ్మతులు చేయలేని విధంగా శాశ్వతంగా దెబ్బతింటున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జూలై 28న కేంద్ర పెట్రోలియం. సహజ వాయువు మంత్రిత్వశాఖకు ‘సియామ్‌’ ఓ లేఖ రాసింది! లేఖలోని సమాచారం ఈనెల 3న సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఆ మార్నాడే అంటే.. మంగళవారం ‘తూచ్‌ అదేం లేదు..’ అన్నట్టుగా కేంద్రానికి రాసిన లేఖను సియామ్‌ ఉపసంహరించుకుంది. అయితే కేంద్రానికి సియామ్‌ రాసిన లేఖ తీవ్ర సంచలనం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఈ-20 వినియోగం మొదలైనప్పటి నుంచి వాహనాల్లో సమస్యలు భారీగా పెరిగినట్లు ఆ లేఖలో సియామ్‌ పేర్కొంది. ఇంజిన్‌ విడిభాగాలు త్వరగా పాడైపోతున్నట్లుగా తాము గుర్తించామని వెల్లడించింది. వాహనాల నుంచి సేకరించిన ఇంధన నమూనాల్లో క్లోరైడ్‌ స్థాయులు 500 మి.గ్రా/కి.గ్రా. వరకు, రిటైల్‌ అవుట్‌లెట్లలో 350 మి.గ్రా/కి.గ్రా. వరకు నమోదయ్యాయని పేర్కొంది.


ఇంధనంలో ఉండాల్సిన దానికంటే అధికంగా తేమ ఉంటోందని సియామ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. అనుమతించదగిన తేమ స్థాయి 3,000 మి.గ్రా/కి.గ్రా. కాగా, అనేక చోట్ల ఇది 10,000 మి.గ్రా/కి.గ్రా. కంటే ఎక్కువగా నమోదవుతోందని తెలిపింది. సియామ్‌ లేఖపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పందించింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఎప్పటికప్పుడు ఇంధన నాణ్యతను పర్యవేక్షిస్తున్నాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 87 వేలకు పైచిలుకు రిటైల్‌ అవుట్‌లెట్లలో ప్రతిసారి వర్షం పడ్డాక 8 నుంచి 12సార్లు (ఇంగ్రెస్‌ పొటెక్షన్‌-ఐపీ) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 2వేలకు పైగా నమూనాలను క్లోరైడ్‌, సల్ఫైడ్‌ పరీక్షల నిమిత్తం సేకరించగా, రెండు చోట్ల మాత్రమే క్లోరైడ్‌ కాలుష్యం నిర్ధారణ అయిందని, వెంటనే ఆ బంకుల్లో అమ్మకాలను నిలిపివేశామని తెలిపింది. మరోవైపు.. తాము రాసిన లేఖపైనే తాజాగా సియామ్‌ మాట మార్చేసింది. ఈ-20పై లేఖ ద్వారా తాము పంపిన నివేదికలోని గణాంకాలపై మరింత పరిశోధన, కచ్చితమైన ధ్రువీకరణ అవసరం అని సియామ్‌ పేర్కొంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వివరాలను తెప్పించుకొని సమగ్ర చర్చలు జరపాల్సి ఉందని వివరించింది.

ఇవీ చదవండి:

ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు

'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం

Updated Date - Aug 06 , 2026 | 06:07 AM