Share News

ఈ20 జనతా పార్టీ

ABN , Publish Date - Jul 28 , 2026 | 06:15 AM

నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) సాగించిన ఉద్యమం విజయవంతం అయిన నేపథ్యంలో.. ఇదే స్ఫూర్తితో కొత్తగా ‘ఈ20 జనతా పార్టీ’ పుట్టుకొచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌...

ఈ20 జనతా పార్టీ

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌కు వ్యతిరేకంగా గళం

  • ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌లో మొదలైన ఉద్యమం

  • మూడు లక్షలకు చేరువైన ఫాలోవర్లు

  • నితిన్‌ గడ్కరీ రాజీనామాకు డిమాండ్‌

న్యూఢిల్లీ, జూలై 27: నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) సాగించిన ఉద్యమం విజయవంతం అయిన నేపథ్యంలో.. ఇదే స్ఫూర్తితో కొత్తగా ‘ఈ20 జనతా పార్టీ’ పుట్టుకొచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విట్టర్‌)లో ఆరంభమైన ఈ పార్టీ ఖాతాలకు ఇప్పటికే 2,95,000 మంది ఫాలోవర్లుగా మారిపోయారు. ప్రస్తుతం దేశంలో 20ు కలిపిన పెట్రోల్‌ (ఈ20)ను విక్రయిస్తున్నారు. దీనివల్ల మైలేజీ తగ్గుతోందని, ఇంజన్‌లో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతుండడం తెలిసిందే. మరోవైపు, ఇఽథనాల్‌ కలపని స్టాండర్డ్‌ పెట్రోల్‌ విక్రయానికి తిరిగి మళ్లే ఉద్దేశ్యమేదీ లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ఈ20 పెట్రోల్‌తో వాహనాలు దెబ్బతింటాయనడం ఒట్టి ఆరోపణేనని పేర్కొంది. కానీ, మైలేజీ 5ు వరకు తగ్గుతుందని తెలిపింది. అయినప్పటికీ ఈ20తో ఇంజన్‌ విడిభాగాలు దెబ్బతింటాయన్న ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100ు అచ్చమైన పెట్రోల్‌ను కూడా బంకుల్లో అందుబాటులో ఉంచాలని, నచ్చిన ఇంధనాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉండాలని ఈ20 జనతా పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ20 పెట్రోల్‌ను గట్టిగా సమర్థిస్తున్న కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ, తన పదవికి రాజీనామా చేయాలని కోరుతోంది. మరోవైపు, ఈ20 పెట్రోల్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ.. దీన్నుంచి తాను, తన కుటుంబం లాభాలు పొందుతోందంటూ ఆన్‌లైన్‌ పోస్టులతో పరువుకు నష్టం కలిగిస్తున్నారని కేంద్ర మంత్రి గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి నాగ్‌పూర్‌ పోలీసులు నలుగురు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌పై రెండు వారాల క్రితం కేసు కూడా నమోదు చేశారు.

ఎన్ని వాహనాలు అనుకూలమో తెలియదు

దేశంలో ఈ20 పెట్రోల్‌ వాడకానికి పూర్తి అనుకూలంగా ఉన్న వాహనాల శాతం ఎంత అనే అంచనాలేవీ లేవని కేంద్రం వెల్లడించింది. అయితే, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఈ20 పెట్రోలును వినియోగించడం పూర్తిగా సురక్షితమని, వాహనాలకు సమస్యలేమీ రావని విస్తృత అధ్యయనాలు, క్షేత్రస్థాయి ప్రయోగాల్లో తేలినట్లు పేర్కొంది. కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్‌ గోపి సోమవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు. దేశంలో ఈ19, 20 పెట్రోలు వినియోగంలోకి వచ్చి రెండున్నరేళ్లకు పైగా అవుతోందని.. 20 కోట్ల ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోలు కార్లలో ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నారని వివరించారు. ఇథనాల్‌ కలపవడం ఇంజన్లు విఫలమవడం, వాహనాలు అకస్మాత్తుగా మరమ్మతులకు గురవడం వంటి ఘటనలేవీ చోటుచేసుకోలేదని చెప్పారు. జాతీయ జీవ ఇంధన విధానం ప్రకారం ఆహార ధాన్యాల నుంచి కూడా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.


ఈ20 సమస్యపై ఆగస్టు 4న పార్లమెంటుకు మార్చ్‌

పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపాలన్న(ఇథనాల్‌ బ్లెండింగ్‌) నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో ఢిల్లీకి చెందిన రవాణా సంఘాలు ఆగస్టు 4న పార్లమెంట్‌కు మార్చ్‌ నిర్వహించనున్నాయి. ‘ఢిల్లీ టాక్సీ, టూరిస్టు ట్రాన్స్‌పోర్టు, టూర్‌ ఆపరేటర్ల సంఘం’తో పాటు పలు సంఘాలు ఈ మేరకు సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ‘‘ఈ20 పెట్రోల్‌ సమస్యపై నిద్రపోతున్న ఎంపీలను తట్టిలేపడానికే ఈ మార్చ్‌ను నిర్వహించతలపెట్టాం’’ అని ఢిల్లీ టాక్సీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ సంజయ్‌ సామ్రాట్‌ అన్నారు. ‘‘ఈ సమస్యను మేం రాజకీయం చేయాలనుకోవడం లేదు. ఈ20 జనతా పార్టీ పేరుతో ప్రారంభమైన ఆన్‌లైన్‌ ఉద్యమంతో గానీ, కాక్రోచ్‌ జనతాపార్టీతో గానీ మాకు సంబంధం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ పార్లమెంట్‌ మార్చ్‌కు ‘ఆలిండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌’ కూడా మద్దతు ప్రకటించింది. పెట్రోల్‌ బంకుల్లో ఈ20 పెట్రోల్‌ను ఒక ఆప్షన్‌గా మాత్రమే పెట్టాలని సూచించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్‌ సర్కార్‌..!

బడా బాబుల జోలికి వెళ్లని హైడ్రా: టీబీజేపీ చీఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 28 , 2026 | 06:15 AM