సీఎం విజయ్‌పై అవాకులు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:03 AM
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై అవాకులు, చవాకులు పేలిన డీఎంకే నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు....
ఓ నటితో కలిసి సీఎం ఇంటిపట్టునే ఉంటున్నారని
మాజీ మంత్రి రాధాకృష్ణన్ వ్యాఖ్యలు
కేసు నమోదు చేయడంతో హైకోర్టుకు..
తీవ్రంగా మందలించిన న్యాయస్థానం
ముఖ్యమంత్రిపై ఇలాంటి మాటలా?..
ఎమ్మెల్యేగా బాధ్యత లేదా అని నిలదీత
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత..
కొద్దిసేపటికే అరెస్టు చేసిన పోలీసులు
చెన్నై, జూలై 3(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై అవాకులు, చవాకులు పేలిన డీఎంకే నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తిరుచందూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాధాకృష్ణన్ గత నెల 20న జరిగిన ఓ బహిరంగసభలో నోటికి పనిచెప్పారు. ముఖ్యమంత్రి విజయ్ ఓ నటితో ఇంటిపట్టునే గడుపుతున్నారంటూ హేళన చేశారు. సీఎంను ఏకవచనంతో సంబోధించారు. రాజకీయాల్లోకి రాకముందు విజయ్ సినీ పరిశ్రమలో గడిపిన జీవితం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. కేసు నమోదు వ్యవహారం తెలియగానే.. రాధాకృష్ణన్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. మాజీ మంత్రి రాధాకృష్ణన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధిగా, మాజీ మంత్రిగా ఇలాంటి మాటలేనా మాట్లాడేది? అని నిలదీసింది. అంతేకాదు, రాష్ట్రానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఉపేక్షించలేమని స్పష్టం చేసింది. ‘‘బాధ్యత గల నేతలైవుండి, సీఎం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తారా?. ఈ వ్యాఖ్యల ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపాలనుకుంటున్నారు. రాష్ట్రంలో 1967 నుంచి సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఎన్నికవుతున్నారు. అలాంటప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు ఎలా చేస్తారు?. పిటిషనర్ బాధ్యత గల నేత. శాసనసభ్యుడు కూడా. అన్నీ తెలిసీ సీఎం పట్ల అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారు?.’’ అని ధర్మాసనం నిలదీసింది. మాజీ మంత్రి వ్యాఖ్యల్లో రెచ్చగొట్టే చర్య ఉండడం వల్లే పోలీసులు కేసు నమోదు చేశారని, లేకుంటే ఎందుకు నమోదు చేస్తారని ప్రశ్నించింది. ఈ క్రమంలో రాధాకృష్ణన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇళంతిరయన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ వెంటనే.. అరెస్టు
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చిన కొద్దిసేపటికే రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆత్తూరు వద్ద డీఎంకే పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాధాకృష్ణన్ అరెస్టును డీఎంకే అధ్యక్షుడు, మాజీ సీఎం స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. రాధాకృష్ణన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను టీవీకేలో చేరాలని అధికారులు ఒత్తిడి చేశారు. నేను తిరస్కరించారు. అందుకే కేసు పెట్టి అరెస్టు చేశారు.’’ అని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..