Share News

శివకుమార్‌ అనే నేను..

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:31 AM

‘‘డీకే శివకుమార్‌ అనే నేను..’’ అంటూ.. కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా దొడ్డ ఆలనహళ్లి కెంపేగౌడ(డీకే) శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో...

శివకుమార్‌ అనే నేను..

కర్ణాటక సీఎంగా డీకే ప్రమాణం.. డిప్యూటీగా పరమేశ్వర్‌

రాహుల్‌, ఖర్గే హాజరు.. మంత్రివర్గంలో 13 మందికి చాన్స్‌

మాజీ ముఖ్యమంత్రి సిద్దూ, ఖర్గే వారసులకు అవకాశం

స్పీకర్‌ యూటీ ఖాదర్‌కూ క్యాబినెట్‌లో చోటు

బెంగళూరు, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ‘‘డీకే శివకుమార్‌ అనే నేను..’’ అంటూ.. కర్ణాటక రాష్ట్ర 25వ ముఖ్యమంత్రిగా దొడ్డ ఆలనహళ్లి కెంపేగౌడ(డీకే) శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని లోక్‌భవన్‌లో గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ డీకేతో ప్రమాణ స్వీకారం చేయించారు. బుధవారం సాయంత్రం 3.50 గంటలకు డీకే లోక్‌భవన్‌కు చేరుకున్నారు. అభిమానులు, తాజా మాజీ మంత్రులు, పార్టీ ముఖ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న ఆయన, తాను నమ్మిన నొణవినకెరె కాడుసిద్దేశ్వర మఠాధిపతి వీరగంగాధర అజ్జయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం గవర్నర్‌ థావర్‌ చంద్‌.. డీకేతో ప్రమాణం చేయించారు. రాజ్యాంగాన్ని పట్టుకుని.. ‘డీకే శివకుమార్‌ అను నేను..’ అంటూ వీరగంగాధర అజ్జయ్య పేరిట ప్రమాణం చేశారు. ఆ వెంటనే సీనియర్‌ నేత పరమేశ్వర్‌ కూడా ప్రమాణం చేశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పేరిట ఆయన ప్రమాణం చేశారు. ఆ తర్వాత సీనియర్‌ నేత కేహెచ్‌ మునియప్ప, కేజే జార్జ్‌లు దేవుడి పేరిట, ఎంబీ పాటిల్‌ విశ్వగురు అణ్ణ బసవణ్ణ బసవాది సిద్దేశ్వర పేరిట ప్రమాణం చేశారు. అనంతరం, రామలింగారెడ్డి, సతీశ్‌ జార్కిహొళి, కృష్ణబైరే గౌడ, ప్రియాంక్‌ ఖర్గేలు సాధారణంగానే ప్రమాణం చేశారు. మూడేళ్లపాటు స్పీకర్‌గా వ్యవహరించిన యూటీ ఖాదర్‌ దేవుడి పేరిట ప్రమాణస్వీకారం చేశారు. ఈశ్వర్‌ ఖండ్రె తన గురువు చన్నబసవ పట్టదేవరు పేరిట ప్రమాణం చేశారు. సిద్దరామయ్య కుమారుడు యతీంద్ర, బైరతి సురేశ్‌, శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్‌లు దేవుడిపేరిట ప్రమాణం చేశారు. పరమేశ్వర్‌కు ఉపముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు.


సీఎంలు సహా...

డీకే ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం వీడీ సతీశన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్‌విందర్‌సింగ్‌ సుఖు, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహ్మద్‌ అజ్జారుద్దీన్‌ హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా వచ్చారు. తాజా మాజీ సీఎం సిద్దరామయ్య, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విభు భక్రు, పరిషత్‌ సభాపతి బసవరాజ హొరట్టి, మాజీ సీఎం వీరప్పమొయిలీ సహా పలువురు పాల్గొన్నారు. సీఎం డీకే శివకుమార్‌, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలోని ప్రముఖ మఠాల స్వామిజీలు సుమారు 40 మందికిపైగా వచ్చారు. ముస్లిం, క్రైస్తవ మతపెద్దలు పాల్గొన్నారు. డీకే శివకుమార్‌ స్వగ్రామం దొడ్డ ఆలహళ్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, మహిళా కార్మికులు, ప్రజాసంఘాల ముఖ్యులు హాజరయ్యారు. సినిమా రంగానికి చెందిన ‘నెనపిరలి’ ఫేమ్‌ ప్రేమ్‌ కుటుంబ సభ్యులు, మాజీ నటి, మాజీ ఎంపీ రమ్య, క్రికెటర్‌ అనిల్‌కుంబ్లె సహా పలువురు పాల్గొన్నారు. బెంగళూరులోని పలు ప్రాంతాలు, రాష్ట్రంలోని 230 ఆర్టీసీ బస్టాండ్‌లలో భారీ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసి ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.

సోనియా ఫోన్‌

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తామని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. డీకే శివకుమార్‌కు సోనియాగాంధీ ఫోన్‌ చేసి అభినందించారు. అందరినీ కలుపుకొని పోవాలని, ప్రజాపాలనను ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలని ఆమె సూచించారు.


యడియూరప్ప ఇంటికి వెళ్లి..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ముందే డీకే శివకుమార్‌ బీజేపీ అగ్రనేత, మాజీ సీఎం యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయానికి చేరుకున్న మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీని స్వాగతించేందుకు డీకే స్వయంగా వెళ్లారు. ప్రమాణస్వీకారం ముగిశాక తేనీటి విందు సమయంలో సీఎం డీకే శివకుమార్‌ భార్య ఉష, కూతురు ఐశ్వర్య, కుమారుడు ఆకాశ్‌.. తాజా మాజీ సీఎం సిద్దరామయ్య పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 06:31 AM