Share News

నేడే డీకే పట్టాభిషేకం!

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:42 AM

ర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు బెంగళూరు లోక్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం...

నేడే డీకే పట్టాభిషేకం!

  • కర్ణాటక సీఎంగా సాయంత్రం ప్రమాణస్వీకారం

బెంగళూరు, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 4.05 గంటలకు బెంగళూరు లోక్‌భవన్‌లో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని డీకే మంగళవారం ఆహ్వానించారు. మరోవైపు కర్ణాటక క్యాబినెట్‌ కూర్పు గురించి డీకే శివకుమార్‌, సిద్దరామయ్య ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో సమావేశమై చర్చించారు. మంత్రివర్గంలో ప్రస్తుతానికి కొందరికి మాత్రమే అవకాశం ఇచ్చి, ఆ తర్వాత విస్తరించాలని నిర్ణయించారు. తొలి జాబితాలో ఎంతమంది ఉండేదీ రాత్రి వరకూ స్పష్టత రాలేదు. 8 నుంచి 12 మంది వరకూ అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ జాబితాలో సిద్దరామయ్య ప్రభుత్వంలో కొనసాగిన సీనియర్‌ మంత్రుల పేర్లు ఉన్నాయి. కొత్తవారిలో సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర మాత్రమే ఉన్నారు. ఢిల్లీ నుంచి మంగళవారం రాత్రి 8గంటలకు డీకే శివకుమార్‌, సిద్దరామయ్య బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. కాగా, డీకే క్యాబినెట్‌లో చోటు కోసం 40మందికి పైగా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. నలుగురైదుగురు మినహా సిద్దరామయ్య మంత్రివర్గంలోని వారంతా ఢిల్లీలోనే ఉన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్‌ ‘ఎక్స్‌’ వేదికగా గాంధీ కుటుంబాన్ని కొనియాడారు. ‘నేను అప్పుడప్పుడు రాజీవ్‌ గాంధీ గురించి ఆలోచిస్తాను. నా సామర్థ్యాన్ని ఆయనే ముందుగా గుర్తించారు’ అని డీకే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సీఎం పదవి పోయినా సిద్దరామయ్య ఇప్పుడుంటున్న అధికారిక నివాసం ‘కావేరి’లోనే ఉండనున్నారు. ఇందుకు సంబంధించి సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. దీని ప్రకారం 2028 వరకు సిద్దరామయ్య కావేరిలోనే ఉండనున్నారు. డీకే కొన్ని రోజులపాటు సదాశివనగర్‌లోని సొంత ఇంటిని అధికారిక నివాసంగా మార్చుకుంటారు. ఆ తర్వాత మరో ఇంటికి మారే అవకాశం ఉంది.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 05:42 AM