ఆలయంలో డీకే శివకుమార్ వీడియోపై చెప్పులు విసిరిన భక్తులు.. అసలేం జరిగింది..
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:00 PM
కర్ణాటకలోని ప్రముఖ హాసనాంబ ఆలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ తెరపైకి కొందరు భక్తులు చెప్పులు విసిరారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలోని ప్రముఖ హాసనాంబ ఆలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ తెరపైకి కొందరు భక్తులు చెప్పులు విసిరారు. ఆయన దర్శనం కోసం ఆలయంలో సాధారణ భక్తులను గంటల తరబడి వేచి ఉండేలా చేశారనే ఆగ్రహంతోనే భక్తులు ఇలా చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి (DK Shivakumar Hasanamba Temple).
దీపావళి సందర్భంగా నవంబర్ 8, ఆదివారం డీకే శివకుమార్ తన భార్య ఉషతో కలిసి కర్ణాటకలోని హాసన్ పట్టణంలో ఉన్న హాసనాంబ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాక, పూజల నేపథ్యంలో సాధారణ భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అప్పటికే వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు (Devotees Throw Slippers).
ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్ వద్ద ఏర్పాటు చేసిన పెద్ద తెరపై డీకే శివకుమార్, ఆయన భార్య ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలను ప్రదర్శించారు. గంటల తరబడి వేచి ఉన్న కొందరు భక్తులు ఆ దృశ్యాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు తమ చెప్పులు తీసి తెరపైకి విసిరారు. ఈ ఘటనపై కర్ణాటక బీజేపీ స్పందించింది. తెరపై ఆయనను చూసినప్పుడే ఇలా జరిగిందని, ప్రత్యక్షంగా ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చంటూ విమర్శించింది (VIP Darshan Controversy).
కాగా, ఈ ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని డీకే శివకుమార్ వర్గం ఆరోపించింది. భక్తులు చెప్పులు విసరలేదని, జనతాదళ్ (సెక్యులర్) కార్యకర్తలే ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని పేర్కొంది. కాగా, హాసనాంబ ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి, దీపావళి సమయంలో కొద్ది రోజుల పాటు మాత్రమే తెరుస్తారు. దీంతో ఆలయం తెరిచిన సమయంలో కర్ణాటకతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ఇవి కూడా చదవండి..
ఎన్విడియా సీఈఓ వ్యవహారంపై ఎఫ్బీఐ దర్యాప్తు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..