డీకేకి ఆదిలోనే హంసపాదు!
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:58 AM
కర్ణాటకలో నాయకత్వ మార్పిడి ప్రశాంతంగా ముగిసింది. కానీ సీఎం డీకే శివకుమార్ మంత్రులకు శాఖలు కేటాయించిన గంటల్లోనే ముసలం మొదలైంది. తనతోపాటు..
శాఖల కేటాయింపులపై మంత్రుల్లో అసంతృప్తి
జలవనరుల శాఖ మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా
పౌర సరఫరాల శాఖపై మునియప్ప అలక
బెంగళూరు, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో నాయకత్వ మార్పిడి ప్రశాంతంగా ముగిసింది. కానీ సీఎం డీకే శివకుమార్ మంత్రులకు శాఖలు కేటాయించిన గంటల్లోనే ముసలం మొదలైంది. తనతోపాటు ప్రమాణ స్వీకారం చేసిన 13 మందికి గురువారం రాత్రి ఆయన శాఖలను కేటాయించారు. శుక్రవారం తెల్లవారగానే భారీ జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మీడియాకు చూపించి, అనంతరం తన అనుచరుల ద్వారా విధాన సౌధకు పంపారు. 8సార్లు బెంగళూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు 2023 ఎన్నికల సమయంలోనే బెంగళూరు నగరాభివృద్ధిశాఖను కేటాయిస్తామని హామీ ఇచ్చారని మీడియాకు తెలిపారు. డీకే శివకుమార్ కూడా అదే హామీ ఇచ్చారని చెప్పారు. కానీ తనకు ఇష్టంలేని భారీ జలవనరుల శాఖను కట్టబెట్టారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతకాలం ఇలాంటి అవమానాలను భరించాలో అర్థం కావడం లేదన్నారు. ఆత్మసాక్షి చంపుకొని పదవిలో కొనసాగాలని భావించడం లేదని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేశానని స్పష్టంచేశారు. తనకు సిద్దరామయ్యపై కాని, డీకే శివకుమార్‌పై కాని, అధిష్ఠానంపై ఏమాత్రం కోపం లేదని అన్నారు. తర్వాత తన మొబైల్ స్విచ్చాఫ్ చేసి, తమిళనాడు వైపు బయల్దేరారు. మంత్రి రామలింగారెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సిందని సీనియర్ నేత హెచ్‌కే పాటిల్ అన్నారు. మరోవైపు.. తనకు పౌర ఆహార సరఫరాల శాఖ కేటాయించడంపట్ల మంత్రి మునియప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ బెంగళూరు పర్యటనకు వచ్చిన సందర్భంలోనే, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో కాసేపు మాట్లాడారు. స్థానిక నాయకత్వం సీనియర్ల పట్ల నడుచుకునే విధానం సరిలేదని రాహుల్‌గాంధీకి వివరించారు. ఈ వివాదం గురించి సీఎం, మాజీ సీఎంను రాహుల్‌గాంధీ ఆరా తీశారు. కాగా శాఖల్లో ఎలాంటి మార్పులు ఉండవని అధిష్ఠానం తేల్చి చెప్పినట్టు సమాచారం.
ప్రజల్లో అసంతృప్తి వల్లే
కర్ణాటకలో సీఎం మార్పు: మోదీ
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ఆక్రోశం, అసంతృప్తి ఉండటం వల్లే ముఖ్యమంత్రిని మార్చాల్సి వచ్చిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించారని చెప్పారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోదీ కాంగ్రెస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అనిశ్చితిని, అరాచకత్వాన్ని వ్యాపింపచేసి లబ్ధిపొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని కాంగ్రెస్ ఎగతాళి చేస్తోందని, దేశ విజయాలను తక్కువ చేసి చూపిస్తోందని ఆయన ఆరోపించారు.
రాజ్యసభకు మల్లికార్జున ఖర్గే నామినేషన్
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. బెంగళూరు విధాన సౌధలో శాసనసభ కార్యదర్శి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి విశాలాక్షికి శుక్రవారం ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, సిద్దరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గే, రాహుల్‌గాంధీకి పార్టీ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా విధాన సౌధకు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరుగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్