కానుకలపై ‘కమలం’ గుర్తు!
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:17 AM
తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట మరోసారి చర్చలు జోరందుకున్నాయి.
హీరో ధనుష్ రాజకీయాలపై చర్చ
దీపావళి సందర్భంగా మహిళలకువెండి ప్రమిదలు ఇచ్చిన నటుడు
వాటిపై బీజేపీ ఎన్నికల ‘చిహ్నం’
‘ఆపరేషన్-డీ’: కాంగ్రెస్ ఆరోపణ
విజయ్ రాగా లేనిది..: డీఎంకే
చెన్నై, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాట మరోసారి చర్చలు జోరందుకున్నాయి. వచ్చే నెలలో జరగనున్న దీపావళిని పురస్కరించుకుని తన అభిమానులకు ముఖ్యంగా మహిళలకు ధనుష్ ఇచ్చిన వెండి దీపపు ప్రమిదలు కొత్త చర్చకు దారితీశాయి. ఆదివారం తన అభిమాన సంఘం.. ‘నర్పణి ఇయక్కమ్’ ఆధ్వర్యంలో మహిళా విభాగం సభ్యులకు ఆయన వెండి ‘కామాక్షి’ దీపాల ప్రమిదలను కానుకగా ఇచ్చారు. ఆ దీపాల అడుగు భాగంలో కమలం పువ్వును ముద్రించారు. అయితే, ఈ గుర్తు బీజేపీ ఎన్నికల చిహ్నం కావడంతో ధనుష్ రాజకీయ ప్రవేశంపై సామాజిక మాధ్యమాల్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే అభిమాన సంఘాన్ని పునర్ వ్యవస్థీకరించి, కొత్త జెండా ఆవిష్కరించిన ధనుష్.. రాజకీయాల్లోకిరాబోతున్నారన్న ప్రచారానికి ఈ ‘కమలం దీపం’ మరింత జోరు పెంచింది. తాజాగా ధనుష్ ‘నర్పణి మండ్రం’ పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’(ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చారు. ఆ సంస్థ మహిళా విభాగం చెన్నై శివారులోని తొరైపాక్కంలో ఆదివారం భేటీ అయింది. సుమారు 3 వేల మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన నటుడు ధనుష్.. మహిళలకు వెండి ప్రమిదలను కానుకగా అందించారు. కాగా, ఈ ప్రమిదలపై ‘కమలం’ గుర్తును ముద్రించడం వివాదాస్పదం కావడంతో ధనుష్ అభిమానులు వివరణ ఇచ్చారు. ‘‘ఆ చిహ్నం తయారీదారుల ముద్ర మాత్రమే. దానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు.’’ అని చెప్పినట్లు తెలిసింది.
బీజేపీ-ఆర్‌ఎస్ఎస్ వ్యూహం: కాంగ్రెస్
దనుష్ ఆకస్మికంగా సంస్థాగత మార్పులు చేపట్టడం బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్ రహస్య వ్యూహంలో భాగమని కాంగ్రెస్ సీనియర్ నేత బి. మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. దీనిని ‘ఆపరేషన్ డీ’ లేదా ‘ప్లాన్ సీ’ అని వ్యాఖ్యానించారు. రజనీకాంత్ వంటి సినీ దిగ్గజాలతో తమిళనాట బలపడాలన్న బీజేపీ ప్రయత్నాలు విఫలమయ్యాయని విమర్శించారు. అందుకే ఇప్పుడు మరో నటుడిని ముందుకు తెచ్చి, పరోక్షంగా తమ భావజాలాన్ని విస్తరించుకోవాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. ఇక, అధికార టీవీకే స్పందిస్తూ.. కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నవారిని ఢిల్లీ పెద్దలే పంపుతున్నారని పేర్కొంది. ‘బీజేపీ కొత్త వ్యక్తులను రాష్ట్ర రాజకీయాల్లో ‘నాటుతోంది.’ అని మంత్రి ఆధవ్ అర్జున వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి విజయ్‌కు ధనుష్ ఎప్పటికీ పోటీ కాలేరని ఆర్థిక మంత్రి ఎన్.మేరీ విల్సన్ అన్నారు. కాగా, విజయ్ రాజకీయాల్లోకి రాగలిగినప్పుడు ధనుష్ ఎందుకు రాకూడదని డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్. రఘుపతి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్