Share News

50 శాతం ఎంత నిజం?

ABN , Publish Date - Apr 16 , 2026 | 03:14 AM

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న పునర్విభజన బిల్లులో రాష్ట్రాల వారీగా 50 శాతం చొప్పున నియోజకవర్గాల పెంపు అంశం ఎందుకు లేదు? 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన అని....

50 శాతం ఎంత నిజం?

  • ప్రోరేటాలో నియోజకవర్గాల పెంపు ఉంటుందని ఎన్డీయే ఎంపీల సమావేశంలో అమిత్‌షా వ్యాఖ్యలు

  • దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమేనంటూ కాంగ్రెస్‌, డీఎంకే, లెఫ్ట్‌ తదితర పార్టీల ధ్వజం

  • అన్యాయం జరగదన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌

  • ఎలా నష్టమో వివరించిన సీఎం రేవంత్‌రెడ్డి

  • హైబ్రిడ్‌ ఫార్ములా పేరిట కొత్త ప్రతిపాదన

  • 50శాతం ప్రోరేటాపై విస్తృతంగా జరిగిన చర్చ

  • దేశవ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లిన కేంద్రం యోచన

  • తీరా బిల్లుల్లో ఎక్కడా లేని 50శాతం ప్రస్తావన

  • 2011 జనాభా లెక్కల ప్రకారమే పునర్విభజన అంటూ సవరణ బిల్లులో వెల్లడి

  • దీనినీ వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

  • చివరికి 50 శాతానికి అంగీకరించక తప్పని పరిస్థితి కల్పించేందుకే బీజేపీ వ్యూహం?

  • పార్టీ నేతలకిచ్చిన డాక్యుమెంట్‌లో స్పష్టీకరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న పునర్విభజన బిల్లులో రాష్ట్రాల వారీగా 50 శాతం చొప్పున నియోజకవర్గాల పెంపు అంశం ఎందుకు లేదు? 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన అని ఎందుకు పేర్కొన్నట్లు? బిల్లులోనే లేనప్పుడు 50 శాతం పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేదని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ కె.లక్ష్మణ్‌ ఎందుకు ప్రకటనలు చేసినట్లు? అసలు ఎన్డీయే సమావేశంలో అమిత్‌షా ఈ ప్రతిపాదనను ఎందుకు ప్రస్తావించినట్లు? ఇదంతా బీజేపీ వేసిన స్కెచ్‌లో భాగమేనా? అందులో విపక్షాలు చిక్కుకున్నాయా? చివరికి తాను అనుకున్న ఫార్ములానే బీజేపీ అమలు చేయనుందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం.. నియోజకవర్గాల పునర్విభజన అన్నది జనాభా దామాషా ప్రకారం జరగాల్సి ఉంటుంది. అయితే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించడంతో.. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య జనాభా విషయంలో భారీగా అంతరం ఏర్పడింది. దీంతో నాటి ప్రధాని వాజపేయి హయాంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్య, కేటాయింపును 1971 జనాభా లెక్కల ఆధారంగానే స్థిరపరుస్తూ, 2001 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేశారు. ఈ సవరణ ఆధారంగా జరిగిన పునర్విభజనే ప్రస్తుతం అమల్లో ఉంది. అయితే దేశంలో జనగణన మళ్లీ తెరపైకి రావడంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా చర్చకు వచ్చింది.


జనాభా దామాషాకు ముందు నుంచీ దక్షిణాది వ్యతిరేకం..

జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించేది లేదని దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచీ చెబుతున్నాయి. ఈ మేరకు ఈ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీల నేతలు తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన చెన్నైలో సమావేశమై తీర్మానం చేశారు. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పాల్గొన్నారు. కాగా, జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే.. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాదిన కూడా పలు చిన్న రాష్ట్రాలు నష్టపోతాయన్న ప్రచారం ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఢిల్లీలో అమిత్‌షాతో జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో.. ఈ అంశాన్ని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీలు లేవనెత్తారు. అయితే జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టడం లేదని, రాష్ట్రాల వారీగా లోక్‌సభ, శాసనసభ సీట్లను 50 శాతం చొప్పున పెంచే ఆలోచన చేస్తున్నామని అమిత్‌షా చెప్పుకొచ్చారు. ఎన్డీయే పార్టీల ఎంపీల సమావేశంలో అమిత్‌షా చేసిన ఈ వ్యాఖ్యలు బయటికి వెల్లడి కావడంతో కాంగ్రెస్‌ సహా పలు విపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనను తప్పుబట్టాయి. 50 శాతం పెంపు ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, స్టాలిన్‌ వివిధ వేదికల ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఏకంగా హైబ్రీడ్‌ మోడల్‌ను తెరపైకి తెచ్చారు. పునర్విభజనలో భాగంగా పెంచే లోక్‌సభ సీట్లలో సగం సీట్లను మెరిట్‌ కోటాలో.. జీడీపీకి అత్యధికంగా భాగస్వామ్యం అందిస్తున్న రాష్ట్రాలకు కేటాయించాలన్నారు. మిగిలిన సగం సీట్లను ప్రోరేటాలో అన్ని రాష్ట్రాలకు కేటాయించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను ప్రధాని మోదీతోపాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపిచారు.


50 శాతమేనన్న కేంద్ర మంత్రులు..

సీఎం రేవంత్‌రెడ్డి వాదనను, ఆయన చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ తప్పుబట్టారు. 50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రకటనలు చేశారు. కిషన్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న వాదనలో వాస్తవం లేదని, రేవంత్‌రెడ్డి వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు 50 శాతం సీట్ల పెంపుతో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న రేవంత్‌ వాదనలో శాస్త్రీయత ఏముందని సంజయ్‌ ప్రశ్నించారు. కాగా, ప్రస్తుతం లోక్‌సభ సీట్లలో దక్షిణాది సీట్లు 24 శాతం ఉన్నాయని, 50 శాతం పెంపు తర్వాత కూడా 24 శాతమే ఉంటాయని కె.లక్ష్మణ్‌ అన్నారు. మొత్తమ్మీద పునర్విభజనలో 50 శాతం సీట్ల పెంపును కేంద్రం అమలు చేయనున్నట్లు ఈ ముగ్గురు నేతలూ ధ్రువీకరించారు. మహిళా రిజర్వేషన్‌ చట్టానికి సవరణ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. పునర్విభజన బిల్లునూ ఇదే సమావేశాల్లో పెడతారన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్‌ నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. అయితే మంగళవారం అన్ని పార్టీల ఎంపీలకు కేంద్రం పంపిన మూడు బిల్లుల్లో దేనిలోనూ 50 శాతం చొప్పున సీట్ల పెంపు అన్నది లేదు. పైగా సవరణ బిల్లులో 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేపట్టనున్నట్లు స్పష్టత ఇచ్చింది.

వ్యూహంలో భాగంగానేనా?

జనాభా ప్రాతిపదికన కాకుండా 50 శాతం ప్రోరేటాలో నియోజకవర్గాలను పెంచాలన్న ఆలోచన ఉందంటూ ఎన్డీయే ఎంపీల సమావేశంలో అమిత్‌షా వ్యాఖ్యానించడం బీజేపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ప్రతిపాదనపై ప్రజల్లో విస్తృత చర్చ జరగడం కోసమే ఎన్డీయే ఎంపీలతో అంతర్గత సమావేశంలో అమిత్‌ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశంపైన విపక్షాలు ఏకం కావడంతో.. సరికొత్త ఎత్తుగడకు బీజేపీ తెరతీసిందని, పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న మూడు బిల్లుల్లోనూ ఈ ప్రతిపాదన ఊసు లేకుండా జాగ్రత్త పడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా చట్ట సవరణ బిల్లులో 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. 2011 జనాభా లెక్కలపై విపక్షాలు పార్లమెంటులో అభ్యంతరం తెలుపుతాయని, చివరికి తక్కువ నష్టం జరిగే 50ు సీట్ల పెంపు ప్రతిపాదనకు అవి అంగీకరించే పరిస్థితికి వస్తాయన్నది బీజేపీ అంచనాగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం సాయంత్రం బీజేపీ నేతలకు అందజేసిన డాక్యుమెంట్లలోనూ వివిధ రాష్ట్రాల్లో పెరగనున్న లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సంఖ్య.. 50 శాతాన్నే సూచిస్తోంది. పైగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బుధవారం కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ కూడా ఇదే విషయం చెప్పారు.


మూడు బిల్లులు.. ఒకే తీర్మానం!

అటు ప్రతిపక్షాలను ఇరుకునపెట్టి.. ఇటు డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులను ఆమోదించుకునేందుకు మోదీ సర్కారు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. మొత్తం మూడు బిల్లులను కలిపి ఒకేసారి ఆమోదించేలా తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రతిపక్షాలు డీలిమిటేషన్‌ను తప్పుపడుతూ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేస్తే.. మహిళా బిల్లును కూడా వ్యతిరేకించినట్టే అవుతుందని, దీనితో ప్రతిపక్షాలు వెనకాడుతాయని భావిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా లోక్‌సభ కార్యకలాపాల నిబంధనల్లోని 66వ రూల్‌ ప్రకారం ఒక్కో బిల్లును విడివిడిగా సభ తీర్మానం ద్వారా ఆమోదిస్తుంటారు. ఇప్పుడు మూడు బిల్లులను ఒకే తీర్మానం ద్వారా ఆమోదించేందుకు వీలుగా ఆ నిబంధనను రద్దు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 16 , 2026 | 03:15 AM