సాఫ్ట్‌వేర్ అల్లుడిని కొట్టి చంపారు!
ABN , Publish Date - Aug 23 , 2026 | 06:12 AM
వారి అమ్మాయికి పెళ్లయి మూడున్నరేళ్లయింది! అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్! యువ దంపతులకు నెలల వయసున్న చూడచక్కని కవలలున్నారు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య...
న్యూఢిల్లీ, ఆగస్టు 22: వారి అమ్మాయికి పెళ్లయి మూడున్నరేళ్లయింది! అల్లుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్! యువ దంపతులకు నెలల వయసున్న చూడచక్కని కవలలున్నారు. శనివారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. ఆమె ఫోన్ చేయడంతో కొద్దిసేపటికే పుట్టింటి నుంచి ఐదారుగురు వచ్చారు. వారిని లోనికి ఆహ్వానించిన ఆమె మామ.. వారికి నీళ్లు, చాయ్ ఇస్తున్నాడు. ఆ సమయంలో బయట నుంచి ఇంట్లోకి అలుడొచ్చాడు! ఆ వెంటనే వచ్చినవారంతా అతడిపై విరుచుకుపడ్డారు. అతడిని కింద పడేసి ఛాతీ మీద కాళ్లతో నొక్కిపట్టారు. బాధితుడి తండ్రి.. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అతడిని విసురుగా నెట్టేశారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. మృతుడు 31ఏళ్ల వినయ్ గుప్తా! తమ అబ్బాయిని కోడలి పుట్టింటివారు పథకం ప్రకారమే హత్యచేశారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ సమయంలో తమ ఇంట్లో సీసీ కెమెరాలు పని చేయలేదని, అది కోడలు పనే కావచ్చని అనుమానించారు. పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్