ఢిల్లీలో తొలి కేసు.. వడదెబ్బకు విద్యార్థి మృతి..
ABN , Publish Date - May 21 , 2026 | 05:06 PM
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు సైతం పోతున్నాయి.
న్యూఢిల్లీ, మే 21: దేశ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండ వేడి తట్టుకోలేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రాణాలు సైతం పోతున్నాయి.
ఢిల్లీలో తొలి కేసు..
దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 24 ఏళ్ల ఓ విద్యార్థి ఢిల్లీలో చదువుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం అతడు వడదెబ్బకు గురై కుప్పకూలాడు. స్థానికులు అతడిని డాక్టర్ ఎమ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు బాధితుడి శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్ హీట్ ఉన్నట్లు గుర్తించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.
అయితే, డాక్టర్ల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎండాకాలం మొదలైన తర్వాత ఢిల్లీలో చోటుచేసుకున్న మొదటి వడదెబ్బ మరణం ఇదే కావటం గమనార్హం. ఈ విషయాన్ని వైద్యాధికారులు స్వయంగా వెల్లడించారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. మధ్యాహ్నం వేళ అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించారు. ఎండలోకి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
టీవీ, బైక్ కోసం భర్త, మరిది వేధింపులు.. మహిళ అనుమానాస్పద మృతి..