టీవీ, బైక్ కోసం భర్త, మరిది వేధింపులు.. మహిళ అనుమానాస్పద మృతి..
ABN , Publish Date - May 21 , 2026 | 04:15 PM
ట్విష శర్మ కేసు మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వరకట్న వేధింపుల నేపథ్యంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది.
న్యూఢిల్లీ, మే 21: ట్విష శర్మ కేసు మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో వరకట్న వేధింపుల నేపథ్యంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 2022, డిసెంబర్ నెలలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల రాజు సింగ్, 25 ఏళ్ల వీణా కుమారి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయంలో వీణా తల్లిదండ్రులు కట్నం కింద బంగారం, నగదు, బైక్ ఇచ్చారు. అయితే, తనకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కావాలని రాజు అడిగాడు. వీణా తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోవటంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనివ్వలేకపోయారు.
ఇదే వీణా కుమారి పాలిట శాపంగా మారింది. భర్త రాజు, మరిది రాజ్ కుమార్ ప్రతీ నిత్యం ఆమెను వేధింపులకు గురి చేసేవారు. 2023లో రాజు, రాజ్‌కుమార్ తమ భార్యలతో ఢిల్లీకి వెళ్లిపోయారు. అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఢిల్లీకి వెళ్లినా వీణా కుమారికి వేధింపులు తప్పలేదు. రాజు తమ్ముడి భార్య 40 అంగులాల ఎల్‌ఈడీ టీవీ, ఓ బైకు అదనపు కట్నం కింద తీసుకురావటంతో వీణా కుమారి పరిస్థితి దారుణంగా మారింది. ‘నా తమ్ముడి భార్య టీవీ, బైక్ తెచ్చింది. నువ్వు మాత్రం ఏమీ తేలేదు’ అంటూ రాజు ఆమెను కొట్టడం మొదలెట్టాడు.
అనుమానాస్పద మృతి..
సోమవారం రాత్రి వీణా కుమారి తన సోదరుడికి ఫోన్ చేసింది. అత్తింటి వారు వేధిస్తున్నారని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. కొన్ని గంటల తర్వాత వీణా కుమారి సోదరుడికి రాజు ఫోన్ చేశాడు. ‘మీ సోదరి మేడపై నుంచి కిందపడింది’ అని చెప్పాడు. అతడు హుటాహుటిన సోదరి ఇంటి దగ్గరకు వెళ్లాడు. పోలీసులకు సమాచారం అందటంతో వారు కూడా ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. గాయపడ్డ వీణా కుమారిని ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలోనే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తేల్చారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వరకట్న వేధింపుల కారణంగానే ఆమె చనిపోయినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాజు, రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
టెయిల్ స్ట్రైక్‌కు గురైన ఎయిరిండియా విమానం..