Share News

ఢిల్లీ అష్టదిగ్బంధనం

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:32 AM

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కొనసాగుతోంది. గురువారం భారీ ఎత్తున యువత తరలివచ్చింది. ఢిల్లీ నలుమూలల నుంచేగాక...

ఢిల్లీ అష్టదిగ్బంధనం

  • మెట్రో స్టేషన్ల మూసివేత

  • సెంట్రల్‌ ఢిల్లీలో మొబైల్‌ ఇంటర్నెట్‌ బంద్‌

  • అడుగడుగునా భద్రతాదళాలు, బారికేడ్లు

  • ఆంక్షలతో ఇబ్బందుల్లో ఢిల్లీ వాసులు.. క్యాబ్‌లు

బుక్‌ చేసుకోలేని, డిజిటల్‌ పేమెంట్లు చేయలేని పరిస్థితి

  • ఆలజడి రేపటానికి బీజేపీ కుట్రలు: అభిజిత్‌ దీప్కే

న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కొనసాగుతోంది. గురువారం భారీ ఎత్తున యువత తరలివచ్చింది. ఢిల్లీ నలుమూలల నుంచేగాక దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా యువతీ యువకులు స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు. దీంతో కేంద్రప్రభుత్వం భద్రతా చర్యలను మరింత తీవ్రతరం చేసింది. ప్రదర్శన స్థలం వద్ద భారీ ఎత్తున కేంద్ర బలగాలను మోహరించడమే కాక అడుగడుగునా బారికేడ్లను పలు వరసల్లో ఏర్పాటు చేశారు. పార్లమెంటుకు దారి తీసే పలు మార్గాల్లోనూ బారికేడ్లను నెలకొల్పారు. జంతర్‌మంతర్‌కు యువత రాకను అడ్డుకోవటానికి ఢిల్లీలోని 16 మెట్రోస్టేషన్లను మూసివేశారు. ఆయా స్టేషన్ల వద్ద బలగాలను మోహరించారు. ఫలితంగా నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ మూడు స్టేషన్లను మాత్రం తెరిచారు. మిగిలిన వాటిని మూసే ఉంచారు. మరోవైపు, జంతర్‌మంతర్‌ చుట్టూ 1.5 కి.మీ.ల పరిధిలో సెంట్రల్‌ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. దీంతో క్యాబ్‌లు, ఆటోలను కూడా బుక్‌ చేసుకోలేక జనం ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. డిజిటల్‌ పేమెంట్లు చేయలేక ఇబ్బందులకు గురయ్యారు. ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా జంతర్‌మంతర్‌ వద్ద సందడి తగ్గటం లేదు. యువత వస్తూనే ఉంది. ‘ధరేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి’, ‘వందేమాతరం’, ‘భారత్‌మాతా కీ జై’, ‘విప్లవం వర్ధిల్లాలి’ వంటి నినాదాల హోరు కొనసాగుతోంది. జంతర్‌మంతర్‌ వద్ద అలజడి సృష్టించి పోలీసులతో మరోమారు లాఠీచార్జి జరిపించాలన్న కుట్రతో బీజేపీ గూండాలను పంపిస్తోందని సీజేపీ అధ్యక్షుడు అభిజిత్‌ దీప్కే ఆరోపించారు. ఇటువంటి వ్యక్తులు కనిపిస్తే బయటకు పంపించివేయాలని నిరసనకారులకు పిలుపునిచ్చారు. కొందరు సాధారణ దుస్తుల్లో ఉన్న వాళ్లు కూడా లాఠీలు పట్టుకొని తమ మీద దౌర్జన్యం చేస్తున్నారని, ఒక వ్యక్తి మీద దాడి చేశారని సీజేపీ ప్రతినిధి సౌరవ్‌దాస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 24 , 2026 | 05:33 AM