Share News

మాతృత్వం మహిళ కెరీర్‌కు అడ్డంకి కావొద్దు

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:59 AM

‘‘ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961 కేవలం మహిళ ఉద్యోగాన్ని కాపాడటానికి మాత్రమే కాదు. ఓ మహిళ ప్రసూతి సెలవులను ముగించుకొని తిరిగి ఉద్యోగానికి వచ్చిన తర్వాత.. ఆమెకు...

మాతృత్వం మహిళ కెరీర్‌కు అడ్డంకి కావొద్దు

ప్రసూతి సెలవులో ఉన్న మహిళ హోదాను తగ్గించవద్దు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2: ‘‘ప్రసూతి ప్రయోజనాల చట్టం-1961 కేవలం మహిళ ఉద్యోగాన్ని కాపాడటానికి మాత్రమే కాదు. ఓ మహిళ ప్రసూతి సెలవులను ముగించుకొని తిరిగి ఉద్యోగానికి వచ్చిన తర్వాత.. ఆమెకు అంతకుముందున్న హోదా, గౌరవం, జీతం కల్పించడానికి కూడా’’ అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రసూతి సెలవుపై వెళ్లిన మహిళా ఉద్యోగి హోదాను తగ్గించడం ఆమె పట్ల వివక్ష చూపడం, కించపర్చడం కిందికే వస్తుందని స్పష్టం చేసింది. ‘‘మాతృత్వం మహిళ కెరీర్‌కు అడ్డంకి కాకూడదు. ప్రసూతి సెలవుల కారణంగా ఉద్యోగిని తన హోదా కోల్పోకూడదు’’ అని తేల్చి చెప్పింది. ఈ మేరకు సచిన్‌ దత్తా ధర్మాసనం ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. కేసు ఏంటంటే.. రాఖీ బిస్త్‌ అనే మహిళ సీనియర్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ). 14ఏళ్ల పని అనుభవం ఉంది. ఆమె 2022లో హాషికార్ప్‌ అనే సంస్థలో మేనేజర్‌-అకౌంటింగ్‌గా చేరారు. వేతనం నెలకు రూ.2.6లక్షలు, ఆమె కింద ఐదుగురు సభ్యుల బృందం పనిచేసేది. 2023 మే నెలలో రాఖీ బిస్త్‌ గర్భం దాల్చారు. డిసెంబరులో ప్రసూతి సెలవులు తీసుకున్నారు. 2024 జూలైలో తిరిగి విధుల్లో చేరారు. అయితే, రాఖీ బిస్త్‌ సెలవులు ముగించుకొని వచ్చే సరికి ఆమె స్థానంలో కంపెనీ వేరొకరిని నియమించింది. రాఖీ బిస్త్‌కు పూర్వపు హోదా, బాధ్యతలను ఇవ్వకుండా ట్రెజరీ విభాగానికి బదిలీ చేసింది. అక్కడ ఆమె కింద గతంలోలాగా రిపోర్టింగ్‌ టీమ్‌ లేదు. అంతే కాకుండా ఆమెకు ఒక జూనియర్‌ అకౌంటెంట్‌ చేసే పనులను అప్పగించారు. మేనేజర్‌ స్థాయిలో జరిగే సమావేశాల నుంచి ఆమెను పక్కన పెట్టారు. దీనిపై రాఖీ బిస్త్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

మేం ఉద్యోగం తీసేయలేదు: కంపెనీ

రాఖీ బిస్త్‌కు వేరే బాధ్యతలను అప్పగించడానికి కంపెనీ సమర్థించుకొంది. ‘‘మేము ఆమెను ఉద్యోగం నుంచి తీసేయలేదు. జీతం తగ్గించలేదు. ఆమె మేనేజర్‌ డిసిగ్నేషన్‌ కూడా అలాగే ఉంది. కంపెనీ సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఆమెకు ప్రస్తుత బాధ్యతలు అప్పగించాం’’ అని కోర్టుకు తెలిపింది. దీనిని కోర్టు అంగీకరించలేదు. కోర్టు రాఖీ బిస్త్‌కు అంతకుముందున్న హోదాను, బాధ్యతలను కేటాయించాలని కంపెనీని ఆదేశించింది. సంస్థాగత కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే అకౌంటింగ్‌ మేనేజర్‌ స్థాయికి తగిన హోదా ఇవ్వాలని, భవిష్యత్తులో ప్రమోషన్‌ అవకాశాలు ఉన్న విధులు అప్పగించాలని పేర్కొంది. అంతేకాకుండా, బాధితురాలికి రూ.10లక్షల పరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.1.50లక్షలు కలిపి మొత్తం రూ.11.50లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 05:59 AM