అల్లు అర్జున్ పిటిషన్.. కీలక ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు..
ABN , Publish Date - Apr 17 , 2026 | 05:46 PM
వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ తుషార్ రావు శుక్రవారం విచారణ జరిపారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండానే తన ఫొటో, వాయిస్‌లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నారని అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ తుషార్ రావు శుక్రవారం విచారణ జరిపారు. విచారణ సందర్భంగా జస్టిస్ తుషార్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనికి అల్లు అర్జున్ తరఫు న్యాయవాది స్వాతి కుమార్ స్పందిస్తూ..
హక్కుల ఉల్లంఘన ఒక్క రాష్ట్రానికే పరిమితం కాదని, అందుకే ఢిల్లీ వరకు వచ్చామని చెప్పారు. అల్లు అర్జున్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉందని.. దేశవ్యాప్తంగా ఆయన పేరు, వాయిస్‌లను దుర్వినియోగం చేస్తున్నారని స్వాతి సుకుమార్ పేర్కొన్నారు. ఒక మొబైల్ యాప్ అల్లు అర్జున్ పోలికలతో ఉన్న 'ఏఐ లైక్ నెస్' సృష్టించిందని, దాని ద్వారా యూజర్లు ఆయనతో మాట్లాడుతున్నట్లు భ్రమ కల్పించేలా చేస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
అల్లు అర్జున్ పేరు, సంతకంపై ఇప్పటికే 26 రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌లు ఉన్నాయని వెల్లడించారు. అనుమతి లేకుండా ఆయన గొంతు, శైలిని వాడటం చట్టవిరుద్ధమని స్వాతి సుకుమార్ పేర్కొన్నారు. స్వాతి కుమార్ వాదనలు విన్న జస్టిస్ తుషార్ రావు అల్లు అర్జున్ వ్యక్తిత్వ హక్కులను పరిరక్షించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి
వైసీపీ పాలనలో 30 వేల మంది చనిపోయారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఓటింగ్‌కు ముందు మోదీని కలిసిన రిజిజు