Share News

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:54 PM

దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా ఢిల్లీలోని రేఖా గుప్తా సర్కారు కీలక అడుగు వేసింది. సీఎం అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్, ఇవాళ 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'కు ఆమోదముద్ర వేసింది.

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం
Delhi Cabinet Approves EV Policy 2026

ఢిల్లీ, జూన్ 29: దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా ఢిల్లీ సర్కార్ కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధ్యక్షతన ఇవాళ సమావేశమైన క్యాబినెట్, ప్రతిష్టాత్మక 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'కు ఆమోదముద్ర వేసింది. ఈ విధానానికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించిందని, లెఫ్టినెంట్ గవర్నర్ (LG) తుది ఆమోదం లభించిన వెంటనే జూలై 1 2026 నుంచి దీనిని అమల్లోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ నూతన పాలసీ మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటుంది. కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, పాత వాహనాల స్థానంలో పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలను (ZEV) ప్రోత్సహించేందుకు ఈసారి భారీగా 'స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌లు', కొనుగోలు సబ్సిడీలను ప్రభుత్వం ప్రకటించింది.


రూ.15,000 కోట్ల భారీ ప్రయోజనాలు

రాబోయే నాలుగేళ్లలో ఈ రంగంలో నేరుగా రూ.7,000 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పన్ను మినహాయింపులు, ఈవీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఢిల్లీ ప్రజలకు మొత్తంగా రూ.15,000 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు.

పాత వాహనం ఇస్తే.. రూ. 1 లక్ష వరకు స్క్రాపేజ్ బోనస్!

ఈ పాలసీలో అత్యంత ఆకర్షణీయమైన అంశం పాత BS-IV లేదా అంతకంటే పాత వాహనాల స్క్రాపేజ్ విధానం. ఎవరైనా తమ పాత వాహనాన్ని వదిలేసి, కొత్త వాహనాన్ని (ఈవీ) కొనుగోలు చేస్తే, సాధారణ సబ్సిడీలతో పాటు అదనంగా స్క్రాపేజ్ ఇన్సెంటివ్ లభిస్తుంది.

  • ఫోర్ వీలర్లు (కార్లు): పాత కారును మార్చి కొత్త ఈవీ కార్ కొంటే రూ.1,00,000 స్క్రాపేజ్ బోనస్

  • కమర్షియల్ ట్రక్కులు (N1): గరిష్టంగా రూ.50,000 వరకు ప్రయోజనం

  • త్రీ వీలర్లు (ఆటోలు): రూ.25,000 స్క్రాపేజ్ ఇన్సెంటివ్

  • టూ వీలర్లు (బైకులు/స్కూటర్లు): రూ.10,000 అదనపు లబ్ధి

  • రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100శాతం మినహాయింపు


ఢిల్లీలో కొనుగోలు చేసే అన్ని రకాల ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలకు (Pure EVs) రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి వంద శాతం పూర్తి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఫోర్ వీలర్ల కేటగిరీలో ఈ పన్ను మినహాయింపు కేవలం రూ.30 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్ ధర) ఉండే ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సీఎం

క్యాబినెట్ భేటీ అనంతరం సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల ప్రజలు, స్టేక్‌హోల్డర్లతో సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాతే ఈ సమగ్ర ముసాయిదాను సిద్ధం చేశాం. జూలై 1 నుంచి ఢిల్లీలో వాహనం కొనే ప్రతి ఒక్కరికీ ఈ పాలసీ ద్వారా భారీ లాభం చేకూరుతుంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ స్థాయిలో ఈవీ రంగానికి మద్దతు ఇవ్వలేదు' అని చెప్పారు. ఈ ప్రయత్నానికి మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఢిల్లీలో ఈవీ విప్లవాన్ని వేగవంతం చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కొన్ని కఠినమైన టార్గెట్లను నిర్దేశించుకుంది. నగరవ్యాప్తంగా 32,000 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం, కర్షియల్ వాహనాలు, డెలివరీ బైకులు, ప్రభుత్వ, సంస్థాగత వాహన శ్రేణులను దశలవారీగా పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మార్చడం. ఈ విప్లవాత్మక పాలసీ ద్వారా ఢిల్లీలో వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు గణనీయంగా తగ్గి, గాలి నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.


ఈ వార్తలనూ చదవండి:

జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి

గ్రామాల అభివృద్ధే వికసిత్ భారత్‌కు పునాది: శివరాజ్‌సింగ్

Updated Date - Jun 29 , 2026 | 05:58 PM