Share News

సామాన్యుడిపై మరో భారం.. కిలోకు రూ.2 పెరిగిన సీఎన్‌జీ ధర..

ABN , Publish Date - May 26 , 2026 | 07:51 AM

వాహనదారులకు ఈ ఉదయాన్నే మరో గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇంధన పంపిణీ సంస్థలు కంప్రెస్‌డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోగ్రాముకు రూ. 2 మేర పెంచాయి.

సామాన్యుడిపై మరో భారం.. కిలోకు రూ.2 పెరిగిన సీఎన్‌జీ ధర..
Delhi CNG Price Hiked by Rs. 2 Per Kg Again; Third Increase in 11 Days

న్యూఢిల్లీ, మే 26: దేశ రాజధాని ప్రాంతం (NCR)తో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల వినియోగదారులపై గ్యాస్ కంపెనీలు మరోసారి ధరల భారాన్ని మోపాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. గడిచిన 11 రోజుల్లోనే నాలుగోసారి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను పెంచుతూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) ఇవాళ (మే 26, 2026) నిర్ణయం తీసుకుంది. తాజాగా కిలో సీఎన్‌జీపై రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది.

తాజా పెంపుతో ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో కిలో సీఎన్‌జీ ధర రూ. 83.09 కి చేరింది. ఉత్తర భారతంలోని ప్రధాన నగరాలైన నోయిడా (Noida)రూ. 91.70 ఉండగా, ఘజియాబాద్ (Ghaziabad)రూ. 91.70, గ్రేటర్ నోయిడా (Greater Noida)రూ. 91.70, గురుగ్రామ్ (Gurugram)రూ. 88.12, అజ్మీర్ (Ajmer)రూ. 92.44గా ఉంది.

11 రోజుల్లో రూ. 6 భారం.. ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద సిటీ-గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అయిన IGL.. మే 15వ తేదీ నుంచి ఇప్పటివరకు నాలుగు విడతల్లో మొత్తంగా కిలోకు రూ. 6 మేర ధరలను పెంచింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

  • మే 15: కిలోకు రూ. 2 పెంపు

  • మే 17: కిలోకు రూ. 1 పెంపు

  • మే 23: కిలోకు రూ. 1 పెంపు

  • మే 26 (తాజాగా): కిలోకు రూ. 2 పెంపు


పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయంగా ఇన్‌పుట్ గ్యాస్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ ప్రభావంతోనే దేశీయంగా సీఎన్‌జీ ధరలను పెంచక తప్పలేదని సరఫరాదారులు పేర్కొంటున్నారు. ఐజీఎల్ (IGL) బాటలోనే దేశంలోని మిగిలిన నగరాల గ్యాస్ పంపిణీ సంస్థలు కూడా విడతల వారీగా ధరలను సవరిస్తున్నాయి.

ముంబైలోనూ సబ్సిడీల కట్:

ఈ సంక్షోభ ప్రభావం కేవలం ఉత్తర భారత్‌కే పరిమితం కాలేదు. ముంబైలో అతిపెద్ద గ్యాస్ పంపిణీ సంస్థ అయిన మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సైతం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ పరిస్థితుల ఒత్తిడి కారణంగా.. తమ కమర్షియల్ (వాణిజ్య) వినియోగదారులకు ఇస్తున్న అన్ని రకాల సపోర్ట్ స్కీమ్‌లు, సబ్సిడీలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుసగా పెరుగుతున్న సీఎన్‌జీ ధరల ప్రభావం రవాణా రంగంపై పడే అవకాశం కనిపిస్తోంది.


ఇవి కూడా చదవండి

ఐపీఎల్ 2026: ఆర్సీబీ ఓపెనింగ్ జోడీపై కెప్టెన్ పాటీదార్ ఏమన్నాడంటే?

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

Updated Date - May 26 , 2026 | 11:22 AM