ఢిల్లీలో మరో ‘నిర్భయ’ కాండ
ABN , Publish Date - Sep 01 , 2026 | 06:03 AM
దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన...
కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్
తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి
బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని
గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక
మాయమాటలు నమ్మి మరో బస్సులోకి..
దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు
ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై
పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్ ఢిల్లీలోని కశ్మీర్ గేట్ సమీపంలో ఉన్న రింగురోడ్డు వద్ద బాలికను వదిలేసి వెళ్లిపోయారు. జరిగిన దారుణం నుంచి తేరుకొని బాలిక.. ఓ ఆటోలో సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, అదే రోజు రాత్రి డ్రైవర్ కుల్‌దీప్, కండక్టర్ సందీ్‌పను అరెస్టు చేశారు. వారు యూపీలోకి కాన్పూర్‌నకు చెందిన వారని, నోయిడా నుంచి ఢిల్లీలోని కశ్మీర్‌గేట్ వరకూ దాదాపు 43 కి.మీ.ల దూరంపాటు బస్సును నడిపిస్తూనే దండుగులు బాలిక మీద లైంగికదాడికి పాల్పడ్డారని తేలింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, 2012లో ఢిల్లీ నగరం రోడ్లపై ఇదే తరహాలో ఓ నడుస్తున్న బస్సులో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే.
నర్సరీ విద్యార్థినిపై డ్రైవర్ అఘాయిత్యం
ఔటర్ నార్త్ ఢిల్లీ పూత్‌ఖుర్ద్ అనే ప్రాంతంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో.. నర్సరీ చదివే ఓ చిన్నారి మీద పాఠశాల బస్సు డ్రైవర్ పలుమార్లు లైంగికదాడి జరిపాడు. ఆగస్టు 19వ తేదీన ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్నారి పాఠశాలలోని బాత్‌రూమ్‌కు వెళ్తుండగా అనుసరించిన దుండగుడు.. ఆమె మీద పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడైంది. దీనిపై పోలీసులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. దేశ రాజధానిలో ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న లైంగిక దాడులపై ప్రతిపక్ష ఆమ్‌ఆద్మీపార్టీ తీవ్రంగా స్పందించింది. మహిళ సీఎంగా ఉన్న ఢిల్లీ.. పిల్లల మీద లైంగికదాడులకు రాజధానిగా మారిందని, బాధితులైన చిన్నారులను, వారి తల్లిదండ్రులను సీఎం రేఖాగుప్తా కలిసి కనీసం పరామర్శించటం లేదని ఆప్ నేత సౌరభ్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు..
భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్ కీలక అప్‌డేట్!
ఇందిరమ్మ ఇళ్లు ఉన్న గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం: మంత్రి పొంగులేటి