Share News

బీఫ్‌ తిన్నాడని బడిలో వేధింపులు

ABN , Publish Date - Oct 24 , 2026 | 05:42 AM

తమిళనాడు, కోయంబత్తూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది

బీఫ్‌ తిన్నాడని బడిలో వేధింపులు
beef curry

  • అవహేళన చేసిన తోటి విద్యార్థులు

  • దళిత విద్యార్థి ఆత్మహత్య

  • కోయంబత్తూర్‌లో ఘటన

  • ఇద్దరు విద్యార్థుల అరెస్టు

కోయంబత్తూర్‌, అక్టోబరు 23: తమిళనాడు, కోయంబత్తూర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గొడ్డు మాంసం(బీఫ్‌) తినేవారిని ఓ ఉపాధ్యాయుడు తరగతి గదిలో వేరు చేసి చూడగా.. వారిలో ఓ 11వ తరగతి విద్యార్థి(16)ని తోటి విద్యార్థులు రెండు నెలలుగా అవహేళన చేస్తున్నారు. ఆ వేధింపులు తాళలేక దళిత సామాజిక వర్గానికి చెందిన సదరువిద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి బాధిత కుటుంబం పోలీసులకు చేసిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కోయంబత్తూర్‌కు చెందిన ఏ అఖిలన్‌(16) స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. అయితే, రెండు నెలల క్రితం అఖిలన్‌ క్లాస్‌ టీచర్‌ విజయ్‌కుమార్‌ ఓ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ కోసం తరగతిలోని ఎస్సీ విద్యార్థుల పేర్లు నమోదు చేశారు. ఈ క్రమంలో విద్యార్థుల ఆహారపు అలవాట్లు తెలుసుకున్న విజయ్‌కుమార్‌.. బీఫ్‌ తినే విద్యార్థులు నిలబడాలని ఆదేశించాడు. దీంతో అఖిలన్‌, మరో విద్యార్థి నిలబడ్డారు. ఆ రోజు నుంచి ఆ తరగతికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు అఖిలన్‌ను వేధించడం మొదలుపెట్టారు. కుల దూషణకు పాల్పడడమే కాక భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. అఖిలన్‌ దీనిపై తన క్లాస్‌ టీచర్‌కు, పాఠశాల ప్రదానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అఖిలన్‌ బుధవారం తన ఇంట్లోనే ఉరి వేసుకొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. అఖిలన్‌ మృతికి కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు విద్యార్థులను శుక్రవారం జువైనైల్‌ హోంకు తరలించారు.

ఈ వార్తలు కూడా చదవండి

అమితాబ్ బచ్చన్ బంగ్లాను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్!

మెటా కళ్లద్దాలతో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం: కర్ణాటక సీఎం

Updated Date - Oct 24 , 2026 | 05:46 AM