దక్షిణ తమిళనాడులో తుఫాను బీభత్సం
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:49 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాను ప్రభావంతో దక్షిణ తమిళనాడును వర్షాలు ముంచెత్తాయి.
భారీ వర్షాలకు 14 మంది మృతి
చెన్నై, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాను ప్రభావంతో దక్షిణ తమిళనాడును వర్షాలు ముంచెత్తాయి. గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి, దిండుగల్, కళ్లకుర్చి, మైలాడుదురై, రామనాథపురం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. కోయంబత్తూరులోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరగా, ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక పర్యాటక ప్రాంతమైన నీలగిరి జిల్లాలో భారీ వర్షాల వల్ల 65 చోట్ల మట్టిచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు మార్గాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఊటీకొండ రైలు మార్గంపైనా బండరాళ్లు పడడంతో రైలు సర్వీసును ఈ నెల 29వ తేదీ వరకు నిలిపేశారు. ఇక దిండుగల్ జిల్లా కొడైకెనాల్ పర్యాటక ప్రాంతంలోనూ మూడు రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి తోడు ఘాట్ రోడ్డులో మట్టిచరియలు, రాళ్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. వందలాది వృక్షాలు నేలకూలడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. భారీ వర్షాల వల్ల గోడలు కూలి, నీటి గుంటల్లో మునిగి, విద్యుదాఘాతానికి గురై రాష్ట్రంలో 14 మంది మృతి చెందినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కేఏ సెంగోట్టయ్యన్ ప్రకటించారు. ఒక్క దిండుగల్ జిల్లాలోనే ఆరుగురు మరణించినట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్