‘అక్వాన్’ తుపాను: 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:12 PM
‘అక్వాన్’ తుపాను ముప్పు నేపథ్యంలో 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో 31 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఢిల్లీ, నవంబర్ 19: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'అక్వాన్' (Cyclone Akvan) ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) పూర్తిస్థాయిలో సన్నద్ధమైంది. ఉత్తరం వైపు కదులుతున్న ఈ తుపాను దృష్ట్యా, ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 31 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. వీటికి తోడు అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యల కోసం మరో 18 బృందాలను రిజర్వ్‌లో ఉంచారు.
భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్ నుంచి ఒడిశాలోని పూరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్-యానాం, దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఈ సాయంత్రం సమయంలో గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో (గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో) బలమైన గాలులు వీస్తూ తుపాను తీరం దాటే సూచనలున్నాయి. తీరం దాటిన తర్వాత ఇది తీవ్ర వాయుగుండంగా (Deep Depression) బలహీనపడనుంది. తుపాను ప్రభావం అత్యధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఒడిశా: గంజాంలో 3, పూరి, కోరాపుట్‌లలో 2 చొప్పున.. బాలాసోర్, కేంద్రపారా, కంధమాల్, రాయగడ, మల్కన్‌గిరి, గజపతి, జగత్సింగ్‌పూర్ జిల్లాల్లో ఒక్కొక్క బృందం చొప్పున మోహరించారు.
ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నంలో 4, శ్రీకాకుళంలో 3, పార్వతీపురం మన్యంలో 2, కృష్ణా జిల్లాలో ఒక బృందాన్ని సిద్ధంగా ఉంచారు.
ఇతర రాష్ట్రాలు, యూటీ: తెలంగాణలో 3, తమిళనాడులో 3, ఛత్తీస్‌గఢ్‌లో1, అండమాన్ నికోబార్ దీవుల్లో 1 బృందాన్ని నియమించారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సకాలంలో సహాయక చర్యలు అందించేందుకు వ్యూహాత్మక ప్రాంతాల్లో బృందాలను ఉంచినట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఇప్పటికే అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ప్రకటించాయి. (Cyclone Akvan NDRF Deployment)