Share News

మోదీ.. గద్దె దిగు!

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:25 AM

ఓట్ల చోరీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్‌ చేసింది.

మోదీ.. గద్దె దిగు!
CWC

  • సీఈసీ జ్ఞానేశ్‌, అమిత్‌ షా కూడా తప్పుకోవాలి.. సర్‌ను తక్షణమే నిలిపివేయాలి

  • తొలగించిన 13 కోట్ల పేర్లను తిరిగి చేర్చాలి

  • కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం

  • నాడు నోట్ల రద్దు.. నేడు ఓట్ల రద్దు

  • జెన్‌జీని ఓటుకు దూరం చేసేందుకే ఫామ్‌-6లో

ఏకపక్షంగా మార్పులు: మల్లికార్జున ఖర్గే

  • ఈవీఎం, ఓటరు జాబితా రెండూ ట్యాంపరింగే

  • 2024 లోకసభ ఎన్నికలు ఫిక్స్‌ అయ్యాయి

  • నిరసనలతో ఆగం... ప్రతిఘటనలే: రాహుల్‌

  • జ్ఞానేశ్‌కు మేమేంటో చూపిస్తాం: కేసీ వేణుగోపాల్‌

  • రేవంత్‌, దామోదర్‌, రఘువీరారెడ్డి హాజరు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఓట్ల చోరీకి బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) డిమాండ్‌ చేసింది. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)ను తక్షణమే నిలిపివేయాలని కోరింది. ఈ ప్రక్రియలో తొలగించిన 13 కోట్ల 30 లక్షల మంది పేర్లను తిరిగి జాబితాల్లో చేర్చాలని తీర్మానించింది. మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశమైంది. సమావేశం దాదాపు రెండున్నర గంటలు సాగింది. సీపీపీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌, సీనియర్‌ నేతలు పి.చిదంబరం, సచిన్‌ పైలట్‌, ముకుల్‌ వాస్నిక్‌, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి(తెలంగాణ), డీకే శివకుమార్‌(కర్ణాటక), వీడీ సతీశన్‌(కేరళ), సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు(హిమాచల్‌ ప్రదేశ్‌) పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీ సభ్యుడు, మంత్రి దామోదర రాజనర్సింహ, ఏపీ నుంచి రఘువీరారెడ్డి పాల్గొన్నారు. మొత్తం 68 మంది సభ్యులు సమావేశానికి వచ్చారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం లేదని జైరాంరమేశ్‌ విలేకరులతో అన్నారు. వేణుగోపాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘానికి, ప్రధాని-హోంమంత్రిలతో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతోందని ఆరోపించారు.


తీర్మానంలో ఏముంది?

ఎన్నికల సంఘం(ఈసీఐ) ఒక్క వ్యక్తి నియంత్రణలో నడిచే సంస్థగా మారిపోయిందని సీడబ్ల్యూసీ తీర్మానం ఆరోపించింది. తోటి కమిషనర్లను సంప్రదించకుండానే సీఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నారన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. ఫారం-6 నిబంధనల్లో కమిషన్‌ అనుమతి లేకుండా, చట్ట విరుద్ధంగా మార్పులు చేసిందని తప్పుబట్టింది. ‘‘ఈ ఓట్ల చోరీని ప్రధాని, హోంమంత్రి తరఫున సీఈసీయే దగ్గరుండి నడిపించారు. వారి ముగ్గురి రాజీనామా మినహా మరేదీ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడలేదు’’ అని తీర్మానం స్పష్టం చేసింది. దోషులకు శిక్ష పడే వరకు పోరాటం కొనసాగిస్తామని, ఈ పోరాటం పార్లమెంటులో, న్యాయస్థానాల్లో, వీధుల్లో సాగుతుందని ప్రకటించింది. ఓటు హక్కును కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఈ పోరాటం స్వాతంత్య్ర పోరాటంతో సమానమని అభివర్ణించింది.

ఓట్ల రద్దు ఒక కుట్ర: ఖర్గే

వర్కింగ్‌ కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. పదేళ్ల క్రితం ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, ఇప్పుడు ఓట్ల రద్దుతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఓటర్‌ జాబితాల రక్షకుడైన ఎన్నికల సంఘమే భక్షకుడిగా మారిందని అన్నారు. సొంత సహచరులే నమ్మని సీఈసీ జ్ఞానేశ్‌ను దేశం ఎలా నమ్ముతుంది? అని ఖర్గే ప్రశ్నించారు. మోదీ ఒత్తిడితోనే సీఈసీ ఇలా వ్యవహరించారని, అందువల్ల ప్రధాని నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 1988 డిసెంబరులో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు అధికారం ఇచ్చారని ఖర్గే గుర్తు చేశారు. మోదీ మాత్రం జెన్‌జీ యువతపై కక్షతో ఫారం-6 నిబంధనలను గుట్టు చప్పుడు కాకుండా మార్చారని ఆరోపించారు. ఇలా పథకం ప్రకారం యువతను, పేదలను, దళితులను ఓటుకు దూరం చేస్తున్నారని అన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని ఖర్గే గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏ ఓటరూ హక్కు కోల్పోకుండా చూడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


రెండు రకాల మ్యాచ్‌ ఫిక్సింగ్‌: రాహుల్‌

సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, దేశంలో రెండు రకాల మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరుగుతోందన్నారు. ఈవీఎంలలో, ఓటరు జాబితాల్లో ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్‌ చేస్తున్నారన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా ఫిక్స్‌ అయ్యాయని ఆయన అన్నట్లు తెలిసింది. సీఈసీ, ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు రక్షణ కల్పిస్తూ 2023 డిసెంబరులో చేసిన చట్టం కూడా రాజ్యాంగ విరుద్ధం అని ఆయన అన్నట్లు సమాచారం. హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల అక్రమాలను కాంగ్రెస్‌ లేవనెత్తినపుడు చాలామంది నమ్మలేదని రాహుల్‌ గుర్తు చేశారు. వాస్తవాల ఆధారంగా పార్టీ ఇచ్చిన ప్రజెంటేషన్లతో రెండేళ్లలో వాతావరణం మారిందన్నారు. ఇప్పుడు ఈసీ వ్యవహారాలు బయట పడుతున్నాయంటే అది కాంగ్రెస్‌ పోరాట ఫలితమేనని చెప్పారు. ఎన్నికల సంఘం అవకతవకలపై పోరాటంలో కాంగ్రెస్‌ ఒంటరి పోరాటానికి సిద్ధంగా ఉందని పార్టీ ముఖ్యనేత ప్రియాంకగాంధీ అన్నారు. దీనికోసం కాంగ్రెస్‌ ఎవరిపైనా ఆధారపడదని చెప్పారు. ఈ అంశాన్ని మొదటి నుంచీ కాంగ్రెసే లేవనెత్తుతోందని, ఒంటరిగానైనా పోరాడే సత్తా తమకు ఉందని అన్నారు. జ్ఞానేశ్‌ మొండిగా ఉంటారని, రాజీనామా చేయరని ఓ సభ్యుడు వ్యాఖ్యానించగా, ‘‘ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయలేదా? రాజీనామా చేసే వరకు వీధుల్లో ఆందోళన కొనసాగిస్తాం’’ అన్నారు. జ్ఞానేశ్‌కు ఒక్కరోజు కూడా సీఈసీగా కొనసాగే నైతిక హక్కు లేదని కేసీ వేణుగోపాల్‌ అన్నారు. ఆయన ఒక పనిముట్టు మాత్రమేనని, నియంతలు ప్రజల విశ్వాసం కోల్పోయినపుడు అధికారంలో కొనసాగేందుకు ఇలాంటి సాధనాలను వాడుకుంటారని వ్యాఖ్యానించారు. ఎస్‌ఐఆర్‌ కానీ, సీఈసీ చర్యలు కానీ ప్రధాని, హోంమంత్రి అంగీకారం లేకుండా జరగేవి కావన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై హెడ్ కానిస్టేబుల్ కాల్పులు.. నలుగురి మృతి

అరుణాచల్‌ ప్రదేశ్‌లో భారత సైన్యంపై ఉగ్రదాడి.. జవాన్ మృతి

Updated Date - Sep 30 , 2026 | 03:29 AM