Share News

పిల్లలపై లైంగిక వేధింపుల కేసు.. అవిముక్తేశ్వరానంద స్వామిపై ఎఫ్ఐఆర్

ABN , Publish Date - Feb 21 , 2026 | 07:01 PM

చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.

పిల్లలపై లైంగిక వేధింపుల కేసు.. అవిముక్తేశ్వరానంద స్వామిపై ఎఫ్ఐఆర్
Avimukteshwaranand Saraswati

ప్రయాగ్‌రాజ్: చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి జ్యోతిష్ పీఠ్ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి (Avimukteshwaranad Saraswati) చిక్కుల్లో పడ్డారు. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు (POCSO Special Court) శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది. అవిముక్వేశ్వరానంద శిష్యుడు స్వామి ముక్తానంద్ గిరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదుకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ చౌరాసియా ఆదేశాలిచ్చారు. తక్షణం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఝాన్సీ పోలీస్ స్టేషన్‌కు కోర్టు స్పష్టం చేసింది.


శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ్ ట్రస్ట్ చైర్మన్, శాకుంభరి పీఠాధీశ్వర్ అశుతోష్ బ్రహ్మచారి మహరాజ్ జనవరి 28న సీఆర్‌పీసీ సెక్షన్ 173(4) కింద పిటిషన్ దాఖలు చేశారు. స్వామి అవిముక్తేశ్వరానంద ఆశ్రమం ఒక పద్ధతిప్రకారం చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతోందని, వారణాసిలోని విద్యామఠ్‌లో గురుసేవ పేరుతో మైనర్లపై బెదిరింపులకు పాల్పడుతోందని బ్రహ్మచారి మహరాజ్ తన పిటిషన్‌లో ఆరోపించారు. సుమారు 20 మంది బాధిత పిల్లలు తనను సంప్రదించారని తెలిపారు. తన వాదనను బలపరచే ఒక సీడీని కూడా సమర్పించారు.


కాగా, ఫిబ్రవరి 13న కోర్టు ఇద్దరు మైనర్ బాధితుల నుంచి వీడియోగ్రాఫ్డ్ స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది. ఈ సాక్ష్యాలతో పాటు పోలీసు రిపోర్ట్‌ను కూడా సమీక్షించింది. పోలీస్ రిపోర్ట్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్ ఆదేశాలపై తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. తాజాగా ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలిచ్చారు. కోర్టు తీర్పుపై బ్రహ్మచారి మహరాజ్ హర్షం వ్యక్తం చేశారు. 'దైవిక న్యాయం'గా కోర్టు ఆదేశాలను అభివర్ణించారు. మరోవైపు, అవిముక్తేశ్వరానంద వర్గాలు ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. స్వామి చేపట్టిన గోసంరక్షణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయనపై కట్టుకథలు అల్లుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.


ఇవి కూడా చదవండి..

రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత

పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్ హాజరు

Updated Date - Feb 21 , 2026 | 07:09 PM