Share News

రాజస్థాన్‌లో బీజేపీకి షాక్.. మంత్రుల కంచుకోటల్లోనూ తప్పని ఓటమి

ABN , Publish Date - Nov 21 , 2026 | 03:12 PM

రాజస్థాన్ పురపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార బీజేపీకి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం చుక్కెదురైంది.

రాజస్థాన్‌లో బీజేపీకి షాక్.. మంత్రుల కంచుకోటల్లోనూ తప్పని ఓటమి
Congress secures major victory in Rural local body polls

ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ పురపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార బీజేపీకి పంచాయతీ ఎన్నికల్లో మాత్రం చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో ఘన విజయం దక్కడంతో కాంగ్రెస్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తప్పలేదు. బీజేపీకి నగరాలు, పట్టణాల్లో కనిపించిన ప్రజామద్దతు గ్రామస్థాయిలో కొరవడింది. నగరాభివృద్ధి గృహనిర్మాణ శాఖ మంత్రి ఝాబర్ సింగ్ ఖర్రా కుటుంబసభ్యులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే, మాజీ మంత్రి రాజేంద్ర రాథోడ్ తనయుడు, కోడలు మాత్రం ఈ ఎన్నికల్లో విజయాన్ని అందుకున్నారు.

ఓవరాల్‌గా చూస్తే 17 రాష్ట్ర మంత్రులు, ముగ్గురు కేంద్ర మంత్రులు తమ నియోజకవర్గాల్లో ఆశించిన మద్దతు కూడగట్టలేకపోయారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రేమ్‌చంద్ బైర్వా ప్రాతినిధ్యం వహిస్తున్న దుడు నియోజకవర్గంలో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆరోగ్య శాఖమంత్రి గజేంద్ర సింగ్ ఖిన్వసార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న లొహావత్ నియోజకవర్గం, వ్యవసాయ శాఖ మంత్రి కిరోడీ లాల్ మీనా నియోజకవర్గంలో కూడా బీజేపీకి ఓటమి తప్పలేదు.


ఈ ఎన్నికల ఫలితాల కాంగ్రెస్‌లో నూతనోత్సాహాన్ని నింపాయి. 1,271 జిల్లా పరిషత్ సీట్లలో 794 కాంగ్రెస్ వశమయ్యాయి. 7,520 పంచాయతి వార్డుల్లో 3,785 హస్తం పార్టీ సొంతమయ్యాయి. బీజేపీకి 357 జిల్లా పరిషత్ సీట్లు, 2,213 పంచాయతి వార్డులు వచ్చాయి. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ) 51 జిల్లా పరిషత్ సీట్లు, 497 వార్డుల్లో విజయం సొంతం చేసుకుంది.

పంచాయతీ, పురపాలక ఎన్నికల ఫలితాలను వేర్వేరు అంశాలు ప్రభావితం చేశాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. విస్తృత రాజకీయ అంశాలు, పౌర సమస్యలను దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలు తమ తీర్పు వెలువరించగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్థానిక నాయక్వపరమైన అంశాలు, ప్రజల దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు ప్రభావం చూపించాయి. రోడ్లు, తాగునీరు, విద్యుత్ వసతులు, ఆక్రమణలు, రోడ్ల రిపేర్లలో జాప్యం జరగడం వంటి వాటి ఆధారంగా గ్రామీణప్రజలు తీర్పు వెలువరించారు. స్థానిక మంత్రులు, ప్రజాప్రజాప్రతినిధుల తీరుపై అసంతృప్తి, వర్గపోరు, నాయకులు- క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య సమన్వయ లోపం వంటివన్నీ ఫలితాలపై ప్రభావితం చూపించాయి.


బీజేపీ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. అసత్యాలు, తప్పుడు వార్తల ప్రచారానికి కాంగ్రెస్ పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అయితే, 2028 ఎన్నికలకు సిద్ధం అవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

ఫించను డబ్బుల్లో వాటా కోసం గొడవ.. నానమ్మను చంపేసిన మనవడు..

ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్లాటినం జూబ్లీ వేడుకలు.. స్మారక నాణేన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Updated Date - Nov 21 , 2026 | 03:39 PM