ఏఐసీసీలోకి కొత్త రక్తం!
ABN , Publish Date - Sep 16 , 2026 | 06:30 AM
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని ప్రక్షాళించాలని ఆ పార్టీ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంకల్పించారు. కొత్త రక్తం ఎక్కించాలని నిర్ణయించారు. ఇందులో...
సగం మంది సెక్రటరీలకు ఉద్వాసన?
కార్యదర్శి పదవులకు 9రోజులుగా ఇంటర్వ్యూలు
130 మందిని ప్రశ్నించిన రాహుల్, ప్రియాంక
న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)ని ప్రక్షాళించాలని ఆ పార్టీ అగ్ర నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సంకల్పించారు. కొత్త రక్తం ఎక్కించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏఐసీసీ కార్యదర్శి పదవులకు ఇంటర్వ్యూలు చేపట్టారు. ఈ నెల 7వ తేదీన ఇవి ప్రారంభమయ్యాయి. రాహుల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ప్రియాంకాగాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ కలిసి గత 9 రోజులుగా బ్యాచ్‌లవారీగా 130 మంది ఆశావహులను పిలిచి ప్రశ్నించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునరుజ్జీవానికి ఏం చేస్తారో అడిగి సమాధానాలు రాబట్టారు. పదవులు ఆశిస్తున్నవారి బయోడేటాను, పార్టీలో ఇప్పటివరకు వారి పనితీరు సమాచారాన్ని ముందుంచుకుని ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఒక్కో బ్యాచ్‌లో 12-14 మంది ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఏఐసీసీలో 64 మంది కార్యదర్శులు ఉన్నారు. వారికి వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు. కొందరు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వేణుగోపాల్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరితో మంగళవారం రాహుల్, ప్రియాంక, వేణుగోపాల్ కీలక సమావేశం నిర్వహించారు. వీరి పనితీరును సమీక్షించారు. వీరిలో కనీసం సగం మందిని మార్చనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సదరు ఇంటర్వ్యూలకు హాజరైన నేతలు కొందరు తమను ఏయే ప్రశ్నలు అడిగారో విలేకరులతో పంచుకున్నారు. ‘మా గతం గురించి.. పార్టీలో మా పనితీరు గురించి అడిగారు. ఏయే పాత్ర పోషించామో ప్రశ్నించారు. అద్భుతంగా చేసిన పనులేమైనా ఉంటే చెప్పండన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా విజయాలు సాధించని రాష్ట్రాలు లేదా ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో పార్టీ పునరుజ్జీవానికి మీరైతే ఏం చేస్తారో అడిగారు. ఫలానా రాష్ట్రానికి పంపితే.. ఎలా విధులు నిర్వహిస్తారు.. అక్కడున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా చేపట్టిన సంస్థాగత ప్రక్షాళన గురించీ అడిగారు. ఈ అంశంలో అధిష్ఠానం వైఖరి ఎలా ఉందో తెలుసుకోగోరారు’ అని వివరించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల
చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు
Read Latest AP News And Telugu News