Share News

కులగణనలో ఓపెన్‌ ఫార్మాట్‌ వద్దు

ABN , Publish Date - Aug 26 , 2026 | 06:18 AM

దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రశ్నావళి ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టించేలా ఉందని కాంగ్రెస్‌...

కులగణనలో ఓపెన్‌ ఫార్మాట్‌ వద్దు

దానివల్ల కుల వివరాలు సరిగ్గా నమోదు కావు

  • ఒకే కులానికి దేశవ్యాప్తంగా వేర్వేరు పేర్లు, భాషాపరమైన తేడాలు ఉంటాయి

  • కులం పేరును ప్రజలు ఇష్టానుసారం చెబితే తప్పుడు సమాచారం వచ్చే ముప్పు

  • తెలంగాణ, బిహార్‌ విధానం అనుసరించండి.. ప్రస్తుత ప్రశ్నావళి రద్దు చేయండి

  • పార్టీలు, నిపుణులు, ప్రజల్ని సంప్రదించాక కొత్త ప్రశ్నావళిని రూపొందించండి

  • ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీల లేఖ

  • తాజా ప్రశ్నావళిలో ‘వెనకబడిన తరగతి’ పదమే లేకపోవడంపై అభ్యంతరం

న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనాభా లెక్కల సేకరణకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రస్తుత ప్రశ్నావళి ప్రజలను తీవ్రంగా తప్పుదోవ పట్టించేలా ఉందని కాంగ్రెస్‌ అభిప్రాయపడింది. కులాల వివరాల సేకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఓపెన్‌ ఫార్మాట్‌’ (అంటే ప్రజలు తమ కులం ఏదంటే అదే నమోదు చేసే) విధానంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పద్ధతి వల్ల కచ్చితమైన వివరాలు నమోదు కావని.. కులగణన అసలు లక్ష్యమే నీరుగారిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ప్రశ్నావళిని తక్షణమే పూర్తిగా రద్దు చేయాలని.. అన్ని రాజకీయ పక్షాలను, నిపుణులను, ప్రజలను సంప్రదించిన తర్వాతే కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని డిమాండ్‌ చేసింది. తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన కుల గణన విధానం అత్యంత శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉందని.. తెలంగాణ నమూనాను ప్రామాణికంగా తీసుకుని దేశమంతటా కుల గణన ప్రక్రియను నిర్వహించాలని కోరింది. ఈ మేరకు ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ గాంధీలు సంయుక్తంగా లేఖ రాశారు. కులాల వివరాల సేకరణలో ఓపెన్‌ ఫార్మాట్‌ విధానాన్ని తాము అంగీకరించబోమని పేర్కొన్నారు. ప్రతి కులానికి సంబంధించిన సమాచారం సరిగ్గా నమోదయ్యేలా ప్రశ్నావళిని తక్షణమే మార్చాలని లేఖలో డిమాండ్‌ చేశారు. ఆగస్టు 20న వారు హిందీలో ప్రధాని మోదీకి రాసిన ఈ లేఖ వివరాలను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మీడియాకు మంగళవారం వెల్లడించారు.

డ్రాప్‌డౌన్‌ జాబితా పద్ధతి ఉండాలి..

కేంద్రం రూపొందించిన ప్రస్తుత ప్రశ్నావళితో తప్పుడు డేటా నమోదయ్యే అవకాశం ఉందని ఖర్గే, రాహుల్‌ తమ లేఖలో ఆందోళన వెలిబుచ్చారు. ‘‘జనాభా లెక్కల్లో కులాల నమోదు కోసం ముందస్తు జాబితా లేకుండా ఓపెన్‌ ఎండెడ్‌ ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనివల్ల పౌరులు తమ కులం పేరును ఇష్టం వచ్చిన రీతిలో చెప్పే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒకే కులానికి వేర్వేరు పేర్లు, ఉప కులాలు, భిన్నమైన స్పెల్లింగ్‌లు వాడుకలో ఉన్నాయి. ఈ విధానం వల్ల ఒకే కులం వేలాది పేర్లతో నమోదయ్యే ప్రమాదం ఉంది. ఫలితంగా దేశంలో కులాల సంఖ్య లక్షల్లో ఉన్నట్లుగా తప్పుడు డేటా వస్తుంది. మొత్తం కులగణన ప్రక్రియే నిరుపయోగంగా మారుతుంది. ఈ గందరగోళాన్ని నివారించడానికి ఓపెన్‌ ఫార్మాట్‌ బదులుగా డ్రాప్‌ డౌన్‌ జాబితా పద్ధతిని అమలు చేయాలి. జనాభా లెక్కల సిబ్బంది వద్ద ముందుగానే పొందుపరిచిన కులాల జాబితా ఉంటే కచ్చితమైన సమాచారం నమోదు చేయడానికి వీలుంటుంది.’’ అని ఖర్గే, రాహుల్‌ లేఖలో వెల్లడించారు.


‘వెనుకబడిన తరగతి’ అనే పదమే లేదు...

తాజా ప్రశ్నావళిలో కనీసం ‘వెనుకబడిన తరగతి’ అనే పదం కూడా లేకపోవడంపై ఖర్గే, రాహుల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కులగణనలో సరైన గణాంకాలు రాకపోతే ఎక్కువగా నష్టపోయేది ఓబీసీలు, ఇతర అట్టడుగు వర్గాలేనని స్పష్టం చేశారు. దీనివల్ల విద్య, ఉపాధి, సామాజిక న్యాయం, ప్రభుత్వ పథకాల రూపకల్పన వంటి కీలక అంశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల గణనకు ఇప్పటికే డ్రాప్‌డౌన్‌ జాబితా విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఎస్‌ఈబీసీ) జాబితా, ఆంత్రోపోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డేటా ఆధారంగా ఈ డ్రాప్‌ డౌన్‌ జాబితాను సులభంగా తయారు చేయవచ్చని సూచించారు. తెలంగాణ (2024), బిహార్‌ (2022) రాష్ట్రాల్లో చేపట్టిన కులగణనలకు సంబంధించిన కులాల జాబితా కాపీలను లేఖకు జతచేశారు. కాగా.. దేశంలో ఓబీసీల కులగణన చేయని పక్షంలో బీజేపీ సర్కారును గద్దె దించుతామని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ప్రధాని మోదీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే శాస్త్రీయంగా కులగణన చేయాలని డిమాండ్‌ చేశారు.

జమిలి ఎన్నికలు2029లో అసాధ్యం

నిర్వహిస్తే రాజ్యాంగ ద్రోహమే: చిదంబరం

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు 2029లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం స్పష్టంచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లు రాజ్యాంగ ద్రోహమేనన్నారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు దేశవాప్తంగా ఉద్యమిస్తాయని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని సవరించి.. రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేస్తే 2029లో జమిలి ఎన్నికలు సాధ్యమేనంటూ.. ప్రతిపాదిత బిల్లుపై ఏర్పాటైన జేపీసీ చైర్మన్‌ పీపీ చౌధురి సోమవారం చేసిన వ్యాఖ్యలపై చిదంబరం ఈ మేరకు స్పందించారు. అంతకుముందు చిదంబరం సోమవారం జేపీసీ ఎదుట హాజరై బిల్లుపై తన అభిప్రాయాలను నివేదించారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, జమిలి ఎన్నికలు జరపడం మతిలేని చర్య అని చిదంబరం జేపీసీ ఎదుట స్పష్టంచేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 26 , 2026 | 06:18 AM